తృణమూల్లో భగ్గుమన్న విభేదాలు.
* అభిషేక్ బెనర్జీపై ఎంపీ కల్యాణ్ తీవ్ర ధ్వజం.
* ఆయన అహంకారమే పార్టీకి శాపం.
* నన్ను తీవ్రంగా అవమానించారు.
*ఎవరు కావాలో దీదీనే తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ.
కోల్కతా,మహా.
పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా పేరున్న సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై సంచలన విమర్శలు గుప్పించారు. అభిషేక్ అహంకారం, ఒంటెద్దు పోకడల వల్లే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. అవసరమైతే పార్టీని వీడేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని బాంబు పేల్చారు.
ఒక న్యాయపరమైన కేసుకు సంబంధించి అభిషేక్ వర్గం వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా అవమానించేలా ఉందని కల్యాణ్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కేసులో కోర్టులో వాదనలు వినిపించేందుకు తాను రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమయ్యానని, తీరా చివరి నిమిషంలో తన సేవలు అవసరం లేదని సమాచారం ఇవ్వడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని అన్నారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వేరొక పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒకప్పుడు తన వద్ద జూనియర్లుగా పనిచేసిన న్యాయవాదులనే ఇప్పుడు తన స్థానంలో నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న ఓ సీనియర్ న్యాయవాదికి పార్టీ ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అభిషేక్ బెనర్జీ తనను తాను ఒక రాజులా భావిస్తూ ప్రవర్తిస్తున్నారని కల్యాణ్ ఘాటుగా విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు తాను మమతా బెనర్జీ వెన్నంటే నిలబడి పోరాడానని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు అభిషేక్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, వైఖరి వల్ల పార్టీ పునాదులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధినేత్రి మమతా బెనర్జీ తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ దీదీ నాయకత్వానికే కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటించారు. అయితే, అభిషేక్ లేకుండా పార్టీ మనుగడ సాగించలేదని ఒకవేళ ఆమె భావిస్తే మాత్రం.. బేషరతుగా తాను పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ అధిష్ఠానానికి గట్టి అల్టిమేటం జారీ చేశారు. ఈ తాజా పరిణామం బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.








