Mahaa Daily Exclusive

  బడుల వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం!.

Share

బడుల వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం!.
*విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్లకే పెద్దపీట.
*ముఖ్యమంత్రి విలాసాలకు, గెస్ట్ హౌస్‌లకు మాత్రం నిధుల కొరత లేదు.
*అప్పులు తెచ్చేందుకు బ్రోకర్ల అవతారం.. కమీషన్లతో విమానం కొన్న దళారి.
*మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ నేత, సీఎం సన్నిహితుడి వెన్నుపోటే.
*మేము రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు ఖాయం.
* మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, విలాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టులు, కమీషన్ల కక్కుర్తితోనే విద్యాశాఖలో బడుల ప్రారంభాన్ని వాయిదా వేశారని, దీని వెనుక ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతులకు, విద్యార్థులకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కోసం వంద కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్, నెలకు ఐదు కోట్ల రూపాయల అద్దెతో హెలికాప్టర్ షికార్లు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తోందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పూర్తిగా భ్రష్టుపట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. ఏటా జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి వాయిదా వేయడం వెనుక గుజరాత్ కాంట్రాక్టర్లతో కుదిరిన చీకటి ఒప్పందాలే కారణమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను చేనేత కార్మికులకు, షూ మరియు బెల్టుల తయారీని దళిత కుటుంబాలకు మేలు జరిగేలా లిడ్‌క్యాప్‌ (LIDCAP)కు అప్పగించామని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ఆ పనులను సెంట్రలైజ్ చేసి స్థానికుల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏడు లక్షల మంది గురుకుల విద్యార్థులకు బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు అందలేదని, అన్యాయం జరిగిన చేనేత సంస్థలు కోర్టును ఆశ్రయించాయని తెలిపారు. రేట్లు డబుల్ చేసి టెండర్లు కట్టబెట్టారని, చివరికి పేద పిల్లలు తినే కోడిగుడ్డులోనూ కమీషన్లు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని సాక్షాత్తూ కేంద్రం నివేదిక ఇస్తే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యూకేజీ అని రకరకాల కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు కావడం లేదని, బడుల్లో పనిచేసే స్కావెంజర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవని, పనులు చేసిన అమ్మఒడి మహిళా సంఘాలకు ఒక్కో నియోజకవర్గానికి నాలుగు కోట్ల రూపాయల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చదువు చారెడు, బలపాలు దోసెడు అన్నట్లుగా తయారైందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన సచివాలయానికి వెళ్లని సీఎం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఏడు కోట్ల రూపాయలతో వీవీఐపీ గెస్ట్ హౌస్ అని జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని వంద కోట్ల రూపాయలతో ‘బోధి పెవిలియన్’ పేరుతో విలాసవంతంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు, 10 కోట్ల రూపాయలతో ఫుట్ బాల్ స్టేడియం కడుతున్నారని, అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి సోఫాలు, ఇతర పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విలాసాలకు క్యాంపు ఆఫీసులు కడుతుంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో సొంతంగా మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో డబ్బులు లేవనడం పచ్చి అబద్ధమని, మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు వంద కోట్లు, అందాల పోటీల కోసం మరో వంద కోట్లు దర్జాగా ఖర్చు చేస్తున్నారని, జర్నలిస్టులకు, ఉద్యోగులకు, రైతులకు మాత్రం డబ్బులు లేవంటున్నారని మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి వేల కోట్ల అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం దళారులను పెట్టుకుందని, కమీషన్ల కింద దోచిపెడుతున్న వందల కోట్లతో ముంబైకి చెందిన ఓ బ్రోకర్ ఏకంగా ఓ విమానమే కొనుక్కున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో నెలకు రెండు కోట్ల రూపాయల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో ఇప్పుడు ఐదు కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తూ ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్రే దాగిఉందని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. గతంలో ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న వ్యక్తినే ఇప్పుడు ఈ కుట్ర చేశాడని, ఈ విషయం మధ్యప్రదేశ్ మంత్రి స్వయంగా బయటపెట్టారని గుర్తుచేశారు. ఈ కుట్రపై రేవంత్ రెడ్డి సిట్ విచారణ జరిపించి అసలు నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఇంచార్జికే వెన్నుపోటు పొడిచే నాయకులు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేస్తూ పేదల నడ్డి విరుస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ, రిజిస్ట్రేషన్, మద్యం ధరలు పెంచారని, త్వరలో మందులు, భూమి శిస్తు కూడా పెంచబోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేసిన నాయకుడు, ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచి అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, కేంద్రం పెంచిందని చెప్పే బదులు ఇతర రాష్ట్రాల వలె రాష్ట్ర పన్ను తగ్గించవచ్చు కదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు పరీక్షా ఫీజులు ఫ్రీ అని చెప్పి అడ్డగోలుగా పెంచారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం అని చెప్పి మగవాళ్ల ఛార్జీలు డబుల్ చేశారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అప్పులు తేవడమే కాకుండా, టోల్ గేట్లు, ఇంపాక్ట్ ఫీజుల పేరుతో ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ప్రజల జేబులు గుల్ల చేయబోతున్నారని మండిపడ్డారు. అడ్డగోలు ధరల పెంపుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విమర్శించారు. గత ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేస్తే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాంగ్రెస్ అనుయాయులు కొన్న భూములకు మేలు చేసేందుకు లోపల కూడా జీవో ఎత్తివేసేలా సెక్రటేరియట్‌లో ఫైళ్లు నడుపుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఫార్మాసిటీ రద్దుతో అక్కడికి రావాల్సిన పెట్టుబడులు, ఉద్యోగాలు ఏపీలోని శ్రీసిటీకి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ భూములు రైతులకు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి, సీతక్క ఇప్పుడు ఆ భూములను తమ అనుయాయులకు అప్పజెబుతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఫార్మాసిటీకి కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇతర అవసరాలకు వాడితే వాటంతట అవే రద్దవుతాయని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం తన సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చానని, భూమి ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని ఆయన గుర్తుచేశారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి వివాదాలు లేని పాత భూములే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు అడ్డువస్తే పాత భూములు ఇవ్వలేని వారు ఫ్యూచర్ సిటీలో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో కేసులు ఉన్నాయని, వివాదాలు లేని భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వంద కోట్లతో సంక్షేమ నిధి, అకాడమీ భవనం, అక్రిడిటేషన్లు, జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చెల్లని నోటు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా మేమే ఎందుకు కలవరిస్తున్నామని, సీపీఐ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని స్పష్టం చేశారు.