Mahaa Daily Exclusive

  మధ్యవర్తిత్వంతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం…

Share

మధ్యవర్తిత్వంతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం.
* లండన్‌లో ప్యానెల్ చర్చ.. న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం పాత్రపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు.
లండన్,మహా.
భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వాన్ని (మీడియేషన్) కేవలం ప్రత్యామ్నాయంగానే కాకుండా, అత్యంత పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగంగా ప్రోత్సహిస్తున్నామని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్ బుధవారం ‘టెక్నాలజీ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ మీడియేషన్’ అనే అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం తనకు అత్యంత ఇష్టమైన అంశమని, సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ) ద్వారా శిక్షణ పొందిన మధ్యవర్తులతో ఇప్పటికే ఒక సువిశాలమైన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
దేశంలోని ప్రతి పట్టణం, పల్లెల్లోని వీధుల్లో ఉన్న సామాన్యులకు సైతం మధ్యవర్తిత్వం గురించి అవగాహన ఉందని తాను గర్వంగా చెప్పగలనని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వ చట్టం- 2023 అమల్లోకి రాకముందు నుంచే న్యాయస్థానాలు ఈ విధానాన్ని పటిష్టమైన యంత్రాంగంగా ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. దశాబ్దాలుగా పరిణామం చెందిన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన వ్యవస్థకు ఈ నూతన చట్టం పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. 2004లో తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న నాటి తొలి అనుభవాలను నెమరువేసుకుంటూ.. ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు స్థాయిల్లో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర న్యాయ అకాడమీల ద్వారా మధ్యవర్తులకు తప్పనిసరి శిక్షణ ఇవ్వడం, అలాగే పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారాలపై పౌరుల్లో అవగాహన కల్పించడంలో జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా), లోక్ అదాలత్‌ల పాత్రను ప్రశంసించారు.
వాణిజ్య వివాదాల పరిష్కారంలో ఆర్బిట్రేషన్ కంటే మధ్యవర్తిత్వానికే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రశ్నకు సీజేఐ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. న్యాయవ్యవస్థలో ఈ రెండింటికీ ముఖ్యమైన పాత్ర ఉందని, తాను ఆర్బిట్రేషన్‌ను నిరుత్సాహపరచబోనని అన్నారు. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నప్పుడు వివాదాలు తలెత్తడం అనివార్యమని పేర్కొన్నారు. అయితే, ఆర్బిట్రేషన్ ద్వారా వెలువడే తీర్పులు తరచూ తదుపరి వ్యాజ్యానికి (అప్పీళ్లకు) దారితీసే అవకాశం ఉంటుందని, కానీ మధ్యవర్తిత్వంలో ప్రక్రియ విజయవంతంగా ముగిస్తే వివాదానికి శాశ్వత ముగింపు లభిస్తుందని స్పష్టం చేశారు. ఇది చాలా వేగవంతమైన, మెరుగైన విధానమని, వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు అన్ని పక్షాలు మొదట మధ్యవర్తిత్వం ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవడానికి మొగ్గుచూపాలని సూచించారు. కోర్టులు కేవలం విచారణలకే పరిమితం కాకుండా వివాద పరిష్కారాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పెండింగ్ కేసుల తగ్గింపులో మధ్యవర్తిత్వం పాత్ర ఎంతో కీలకమని, ఇది బలహీనతకు సంకేతం కాదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన మరోసారి గుర్తుచేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్యానెల్ చర్చకు భారత్, యూకేలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు హాజరయ్యారు. భారత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు యూకే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హ్యాంబ్లెన్ ఆఫ్ కెర్సీ, ఇంగ్లాండ్-వేల్స్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు కిర్స్టీ బ్రిమెలో కేసీ, ఇంగ్లాండ్-వేల్స్ లా సొసైటీ ఉపాధ్యక్షుడు బ్రెట్ డిక్సన్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. లండన్‌లోని భారత హై కమిషనర్ కుమారన్.పీ ఈ సదస్సుకు ప్రారంభోపన్యాసం చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్ తన్వి దుబే చర్చకు సమన్వయకర్త (మధ్యవర్తిత్వం)గా వ్యవహరించారు.