Mahaa Daily Exclusive

  ఖమ్మం చిన్నారిపై అఘాయిత్యం అత్యంత దారుణం…

Share

ఖమ్మం చిన్నారిపై అఘాయిత్యం అత్యంత దారుణం.
* శాంతిభద్రతల వైఫల్యానికి సజీవ సాక్ష్యం.
* నిమ్స్‌లో బాధితురాలికి బీజేపీ నేతల పరామర్శ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం.

హైదరాబాద్, మహా.
ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన పైశాచిక అత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిందని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలకు ఇది సజీవ సాక్ష్యమని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దారుణానికి గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం పరామర్శించింది. ఈ బృందంలో రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం జిల్లా ప్రభారీ బద్దం మహిపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు,రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్,నంబూరి రామ లింగేశ్వరరావు తదితరులు ఉన్నారు. నేరుగా ఆసుపత్రికి చేరుకున్న వీరు బాలిక పరిస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. అభం శుభం తెలియని పసికందు రెండు చేతులు విరిగిపోయి, తిరిగి నడవలేని దీనస్థితిలో ఉండటం హృదయ విదారకమని, ఆ పాప తిరిగి సాధారణ స్థితికి రావడం కష్టమని వైద్యులు చెబుతుండటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం నిమ్స్ వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని కల్పించారు.
ఇంత ఘోరం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబానికి కనీస పట్టింపు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతలు వస్తున్నారంటే వంద మంది పోలీసులను మోహరించడంపై ఉన్న శ్రద్ధ, ఆ పసిపాపకు ఉచితంగా మందులు ఇప్పించడంపై ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎక్స్ ఖాతా, వెబ్‌సైట్ హ్యాక్ అవ్వడమే ఈ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోందని నేతలు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదారు పోక్సో కేసులు నమోదవుతున్నాయని, వికారాబాద్ జిల్లాలోని యాలాల్, బొంరాస్‌పేట్, బషీరాబాద్, మోమిన్‌పేటతో పాటు నిర్మల్‌లో జరిగిన వరుస దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్సీఆర్‌బీ డేటా ప్రకారమే 2024లో 2200గా ఉన్న పిల్లలపై దాడుల కేసులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2025 నాటికి ఏకంగా 2400కు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అమానుష ఘటనకు పాల్పడిన నిందితుడు గౌస్ పాషాకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని నేతలు ఆరోపించారు. గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండదండలు ఉండగా, ఇప్పుడు మంత్రి తుమ్మల అండతోనే రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో బోనకల్, చింతకాని, ఖమ్మం టౌన్‌లో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు మూడు జరిగినా పాలకులు పట్టించుకోలేదని, బాధితులను బెదిరించి బయటకు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి ఘటనలను బీజేపీ ఏమాత్రం సహించదని హెచ్చరించారు. తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఈ దారుణానికి పాల్పడిన మృగాలను ఉరితీయాలని, అప్పుడే ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడతారని డిమాండ్ చేశారు. అలాగే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు, బాలిక పూర్తిగా కోలుకునే వరకు అయ్యే శస్త్రచికిత్సలు, ఉచిత వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని నేతలు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని బీజేపీ నేతలు భరోసా ఇచ్చారు.