బొగ్గు వనరులే ‘వికసిత్ భారత్’కు నవ పునాదులు!
* హైదరాబాద్ కోల్ గ్యాసిఫికేషన్ రోడ్‌షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటన.
**దేశవ్యాప్తంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల సృష్టి.
* గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా రూ.3 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా.
* గత పన్నెండేళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన అద్భుత ప్రగతిని వివరించిన మంత్రి.
హైదరాబాద్, మహా.
భారతదేశంలో అపారంగా ఉన్న బొగ్గు వనరులను ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి సరికొత్త పునాదులుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన కార్యక్రమాన్ని దేశం అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన రెండో ‘కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షో’లో పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి, ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను, గత పన్నెండేళ్లలో దేశం సాధించిన ప్రగతిని సమగ్రంగా వివరించారు.
**హైదరాబాద్ కేంద్రంగా గ్యాసిఫికేషన్ ప్రస్థానం**
ఈ ఏడాది మే 28న ఢిల్లీలో జరిగిన తొలి రోడ్ షోకు విశేష స్పందన లభించిందని, ఆ తర్వాతి కార్యక్రమాన్ని దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. అయితే, ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి హైదరాబాద్ నగరమే ఒక మూలాధారమని ఆయన కొనియాడారు. ఒకప్పుడు మన దేశంలో లభించే బూడిద శాతం (యాష్) ఎక్కువగా ఉండే బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అపోహ ఉండేదని, కానీ హైదరాబాద్‌లోని మన శాస్త్రవేత్తలు ఇక్కడి బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసి ఆ అపోహను తొలిగించారని ప్రశంసించారు. ఇందులో బీహెచ్ఈఎల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తో పాటు అనేక పరిశోధనా సంస్థల భాగస్వామ్యం ఉందని గుర్తుచేశారు. తెలంగాణలోని సింగరేణిలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్ వంటి ఉత్పత్తులకు ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్ ఒక అద్భుతమైన మార్కెట్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
**లక్షల కోట్ల పెట్టుబడులు.. వేగవంతమైన అమలు**
దేశంలో ప్రస్తుతం 72 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోందని, అలాగే సిమెంట్, స్టీల్ రంగాలకు బొగ్గు ప్రధాన ఇంధనమని మంత్రి తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ అడుగులు వేసిందని, కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు ఏకంగా రూ.46,000 కోట్లతో భారీ పథకాన్ని తీసుకువచ్చిందని వెల్లడించారు. ఇందులో ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా మెగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కుతాయన్నారు. దీని ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలోకి వస్తాయని, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు వేగంగా అమలు జరగాలన్న ప్రధాని మోదీ స్ఫూర్తికి అనుగుణంగా, కేబినెట్ ఆమోదం తెలిపిన నెల రోజుల లోపే ప్రజలు, భాగస్వాముల నుంచి పారదర్శకంగా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఫర్టిలైజర్లు, కెమికల్స్, హైడ్రోజన్, శుద్ధమైన ఇంధనం ఉత్పత్తి చేయవచ్చని మంత్రి వివరించారు. దేశీయ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే సింథటిక్ నేచురల్ గ్యాస్, అలాగే డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయెల్ ఉత్పత్తిలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఏటా దిగుమతుల కోసం మనం రూ.3 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నామని, ఈ గ్యాసిఫికేషన్ ద్వారా ఆ మొత్తాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. చైనా, దక్షిణాఫ్రికా, అమెరికా లాంటి దేశాలు ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయని, మన దగ్గర కూడా అవసరమైన బొగ్గు నిల్వలు, రాజకీయ నిబద్ధత ఉన్నాయన్నారు.
**కుంభకోణాల నుంచి జీరో టాలరెన్స్ వైపు..**
గతంలో బొగ్గు రంగానికి సంబంధించిన వార్తలు అంటేనే కుంభకోణాలు, అక్రమ కేటాయింపులు గుర్తుకు వచ్చేవని మంత్రి విమర్శించారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతి, లీకేజీల వల్ల పెట్టుబడులు రావడం కష్టంగా ఉండేదన్నారు. కానీ, నేడు సాంకేతిక ఆధారిత పరిపాలన, ఆధార్ ఆధారిత గుర్తింపు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వంటి సంస్కరణల వల్ల వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా మారిందని స్పష్టం చేశారు. అవినీతిపై మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌తో పనిచేస్తోందని, సంస్కరణల వల్ల లీకేజీలు అరికట్టి రూ.4.3 లక్షల కోట్లకు పైగా దేశ సంపదను కాపాడగలిగామని ఆయన గర్వంగా చెప్పారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా దాదాపు 10 వేల ఇబ్బందులను సరళీకరించి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.
**పన్నెండేళ్లలో భారత్ మహోన్నత ప్రగతి**
గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలకు భారత్ బలమైన పునాది వేసిందని కిషన్ రెడ్డి వివరించారు. 2014లో 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, నేడు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, 5 ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోందని తెలిపారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, పీఎం గతి శక్తి లాంటి కార్యక్రమాలతో పరిశ్రమలు విశ్వాసంతో వస్తున్నాయని, 2014-2025 మధ్య కాలంలో 750 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. రోడ్లు (ప్రపంచంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్), రైల్వే (దాదాపు 100% ఎలక్ట్రిఫికేషన్), ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లతో పాటు, రెన్యూవబుల్ ఎనర్జీలో మూడో స్థానంలో, సౌర విద్యుత్‌లో రెండో స్థానంలో నిలిచామన్నారు. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 530 గిగావాట్లకు, పోర్ట్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 2,760 మిలియన్ టన్నులకు చేరిందన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగామని, 1.6 లక్షల స్టార్టప్‌లు, 100కు పైగా యూనికార్న్‌లతో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచామని తెలిపారు. రక్షణ ఎగుమతులు 2014లో రూ.686 కోట్లు ఉండగా, 2026 నాటికి రూ.38,424 కోట్లకు చేరాయన్నారు. ఈ సంస్కరణల వల్లే ప్రపంచ దేశాలు భారత్‌ను కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తున్నాయని మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు.








