Mahaa Daily Exclusive

  బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు….

Share

బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు.
* కళ్యాణోత్సవం, రథోత్సవానికి లక్షలాది మంది భక్తుల రాక.
* ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన

హైదరాబాద్, మహా.
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మంగళవారం, బుధవారం జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, బేగంపేట, ఫతేనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం బోనాల ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా పేరుగాంచింది. కళ్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మార్గమార్పులు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ కమిషనర్ తెలిపారు.

గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట, ఫతేనగర్‌కు వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ ‘టి’ జంక్షన్, బీకే గూడ మీదుగా సనత్‌నగర్ వైపు మళ్లిస్తారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు ఎలాంటి వాహనాలకూ అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వాహనాలను కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట మార్గం వైపు దారి మళ్లించనున్నారు.

అదేవిధంగా గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఫుడ్ వరల్డ్ జంక్షన్ నుంచి బల్కంపేట వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేటకు వచ్చే ట్రాఫిక్‌ను సత్యం థియేటర్, మైత్రీవనం మార్గాల వైపు మళ్లిస్తారు.

రద్దీ నియంత్రణలో భాగంగా ఎస్‌ఆర్ నగర్ ‘టి’ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న అన్ని చిన్న సందులు, బై లేన్లను తాత్కాలికంగా మూసివేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అత్యవసర సేవలు మినహా ఇతర వాహనాలకు ఈ మార్గాల్లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయ ప్రాంగణం, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి భక్తులు నడిచి ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఉత్సవాల సందర్భంగా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున బల్కంపేట, బేగంపేట, ఎస్‌ఆర్ నగర్, ఫతేనగర్ ప్రాంతాలకు వచ్చే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సిబ్బందికి సహకరించి సూచనలను పాటిస్తే రద్దీని సమర్థంగా నియంత్రించవచ్చని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా సేవలను వినియోగించాలని కూడా సూచించారు.