- ఢిల్లీలో హైటెన్షన్
- ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా
- విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్
- పలువురు కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ, మహా : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్యనేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. అంతకుముందు దేశంలోని యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, వారికి ఉన్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడి రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. దిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైనదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా, డీకే శివకుమార్, రాజా వారింగ్తో పాటు పలువురు నేతలు పాదయాత్రగా ప్రధాని నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వైపు వెళ్లారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించి వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ర్యాలీ చేపట్టారని పోలీసులు చెబుతుండగా, ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ధర్నాలో నేతలు ప్లాస్టిక్ ట్యాగ్ లతో చేతులను కట్టేసుకొని నిరసన వ్యక్తం చేశారు.







