Mahaa Daily Exclusive

  వాంగ్‌చుక్‌ను మెదాంతాకు తరలించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.

Share

వాంగ్‌చుక్‌ను మెదాంతాకు తరలించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.
* సీజేపీ ఆందోళనలపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.
ఢిల్లీ, మహా.
పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందేలా తక్షణమే మెదాంతాకు తరలించాలని ఆదేశించింది.
న్యాయమూర్తులు జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ సందర్భంగా ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు వాంగ్‌చుక్ వ్యక్తిగత వైద్యుడితోనూ మాట్లాడింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమనే విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రిలో తన పరిస్థితిపై వాంగ్‌చుక్ వ్యక్తం చేసిన ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుని మెదాంతా ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
వాంగ్‌చుక్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ ద్రవాలు తీసుకుంటున్నారని కోర్టుకు వివరించారు. ఆస్పత్రిలో తనపై పోలీసు నిఘా కొనసాగుతోందని, మొబైల్ ఫోన్ వినియోగానికి కూడా అనుమతి లేదని వాంగ్‌చుక్ రాసిన లేఖను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మెదాంతా ఆస్పత్రికి తరలిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని ఆయన వాదించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వాంగ్‌చుక్‌ను మెదాంతా ఆస్పత్రికి తరలించడంపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. అయితే వైద్యుల సూచనలకు విరుద్ధంగా చికిత్స మధ్యలో డిశ్చార్జ్ కోరరాదని సూచించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని అన్ని వైద్య రికార్డులు, పరీక్షల నివేదికలను మెదాంతా ఆస్పత్రికి వెంటనే అందజేయాలని ఆదేశించింది.
హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందడం కంటే నిర్బంధంలో ఉన్న భావన కలిగిందని ఆరోపించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో లేదని, జంతర్‌మంతర్ వద్దే వైద్య పర్యవేక్షణలో నిరాహార దీక్ష కొనసాగించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనను మెదాంతా ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.
మరోవైపు, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన ‘సంసద్ చలో’ ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, మరో రెండు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ సహా పలు పోలీస్ స్టేషన్లలో ప్రజా ఆస్తుల ధ్వంసం, ఆయుధ చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా రాళ్లదాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సోమవారం జరిగిన ఘర్షణల్లో 118 మందికి పైగా పోలీసులు గాయపడగా, 20కి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే తమ నిరసనలు జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది. మరోవైపు, నీట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలను మరింత ఉధృతం చేస్తూ, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.