Mahaa Daily Exclusive

  భర్త యజమానికి భార్య ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

Share

ఢిల్లీ, మహా.
దాంపత్య వివాదాల నేపథ్యంలో భర్త పనిచేస్తున్న సంస్థకు లేదా యజమానికి భార్య ఫిర్యాదు చేయడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి చర్యల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, దాని ప్రభావం భవిష్యత్తులో భార్యకు లభించాల్సిన భరణంపైనా పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అసోంలో నమోదైన పరువునష్టం కేసును ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
విచారణలో మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, గాజియాబాద్‌లో తన క్లయింట్‌కు భర్తతో పలు కుటుంబ, న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని, ఇదే సమయంలో భర్త స్నేహితుడు అసోంలో ఆమెపై పరువునష్టం కేసు దాఖలు చేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును గాజియాబాద్‌కు బదిలీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో దాంపత్య కలహాల నేపథ్యంలో భర్తల యజమానులు లేదా వారు పనిచేస్తున్న సంస్థలకు భార్యలు ఫిర్యాదులు చేసే ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి చర్యల వల్ల భర్త ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని, జీవిత భాగస్వామి జీవనోపాధిని దెబ్బతీయడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. భర్త ఉద్యోగం కోల్పోతే భవిష్యత్తులో భార్య భరణం కోరే పరిస్థితులపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని సూచించారు.
ఈ కేసులో మహిళ తన భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారని ఢిల్లీలోని వైమానిక దళ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టులో వెల్లడైంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆమెపై పరువునష్టం కేసు నమోదైనట్లు సమాచారం.
అయితే మహిళ తరఫు న్యాయవాది వాదిస్తూ, తన భర్తే ఎయిర్‌ఫోర్స్ హెల్మెట్ చోరీ చేశారంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ హెల్మెట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే వైమానిక దళ అధికారులకు వినతిపత్రం సమర్పించారని చెప్పారు. అంతేకాకుండా పరువునష్టం కేసును భర్త కాకుండా ఆయన స్నేహితుడు దాఖలు చేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరు పక్షాల మధ్య రాజీ అవకాశాలను పరిశీలించాలని భావించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వ కేంద్రానికి బదిలీ చేసింది. పరస్పరం చేసుకున్న ఆరోపణలను ఉపసంహరించుకుని సామరస్యపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.