లిక్కర్ షాపులోకి దూసుకెళ్లిన చిరుత.
* ముగ్గురిపై దాడి…ఐదు గంటల ఉత్కంఠభరిత రెస్క్యూ.
ఢిల్లీ, మహా.
రాజస్థాన్‌లోని తోంక్ జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఓ లిక్కర్ షాపులోకి చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు ఐదు గంటలపాటు ఉత్కంఠభరితంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అటవీ అధికారులు చిరుతను సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
సోమవారం ఉదయం తోంక్ జిల్లా తొదరైసింగ్ పట్టణ సమీపంలో పొదల్లో చిరుతను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ వాలంటీర్ రాకేశ్ మాలి ఘటనాస్థలానికి చేరుకోగా, చిరుత ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం చిరుత మార్కెట్ ప్రాంతంలోకి పరుగెత్తి, లిక్కర్ షాపు బయట కూర్చున్న 40 ఏళ్ల ఫతేహ్‌లాల్ కోలీపై దాడి చేసింది. అక్కడి నుంచి నేరుగా లిక్కర్ షాపులోకి చొరబడి లోపల ఉన్న 25 ఏళ్ల సంజయ్ గుర్జర్‌పై కూడా దాడి చేసింది. అయితే అతను అప్రమత్తంగా బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు.
చిరుత షాపులోనే ఉండగా స్థానికులు వెంటనే షట్టర్ మూసివేయడంతో అది బయటకు రాలేకపోయింది. గాయపడిన ముగ్గురిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం సీనియర్ వెటర్నరీ అధికారి అశోక్ తన్వర్ నేతృత్వంలో అటవీశాఖ ప్రత్యేక బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
సుమారు ఐదు గంటలపాటు శ్రమించిన అనంతరం అటవీ అధికారులు చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలోకి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనాన్ని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత లిక్కర్ షాపులోకి దూసుకెళ్లిన తీరు, భయంతో ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువులు జనావాసాల్లో కనిపిస్తే వాటిని రెచ్చగొట్టకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.







