Mahaa Daily Exclusive

  ఎల్‌నినోను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కోవాలి….

Share

ఎల్‌నినోను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కోవాలి.
* వరి సాగు చేయొద్దని రైతులకు సూచన.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఖమ్మం, మహా.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల సమన్వయంతోనే సమర్థంగా ఎదుర్కోవాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల ఉద్దేశం క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి ముందస్తు కార్యాచరణ రూపొందించడమేనని స్పష్టం చేశారు. రైతులకు వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు, నీటి లభ్యతకు అనుగుణంగా మాత్రమే పంటల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్‌నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇస్తూ, జూలై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని వివరించారు. ప్రస్తుతం రైతులు అధికంగా పత్తి సాగు చేశారని, వర్షాలు కురిస్తే వరి సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు బోర్ల ఆధారంగా వరి సాగు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నమోదైన వర్షపాతం లోటు, దాని ప్రభావం, జలాశయాల్లో నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై ప్రతి రైతుకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గతేడాది, ఈ ఏడాది నీటి లభ్యతపై సమగ్ర నివేదిక రూపొందించి మీడియా, రైతులు, క్షేత్రస్థాయి అధికారులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.

రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై అన్ని సాంకేతిక అవకాశాలను పరిశీలించి తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందే అవకాశం లేదని, పాలేరు ఆయకట్టుకు కూడా సాగునీరు అందుబాటులో ఉండదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాలను దాచకుండా రైతులతో నేరుగా మాట్లాడాలని, నీటి లభ్యత ఆధారంగా మాత్రమే పంటల ఎంపిక చేయాలని సూచించారు.

త్రాగునీటి అవసరాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి వనరులను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వైరా, లంకాసాగర్, పాలేరు జలాశయాల్లోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను పాలేరు జలాశయానికి తరలించే అవకాశాలపై నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.

వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికల ద్వారా ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత, పంటల ఎంపికపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత లేకుండా వరి సాగు చేస్తే తీవ్ర నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులకు ముందుగానే తెలియజేయాలని అన్నారు.

గోదావరి బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి సాధ్యమైనన్ని చెరువులను నింపేందుకు అవసరమైన మోటార్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని, వచ్చే వేసవి వరకు తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశమున్నందున విద్యుత్ సరఫరాపైనా ప్రభావం ఉండవచ్చని, అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, కేవలం మూడు నెలల పరిస్థితులను కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, జూలై 31 నాటికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామాల వారీగా కార్యాచరణ పూర్తి చేయాలని, ఆగస్టు 1 నుంచి వాటి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో నీటి వనరులు, భూగర్భ జలాల వివరాలు సిద్ధంగా ఉంచాలని, సత్తుపల్లి ప్రాంతంలో అధికంగా జరుగుతున్న వరి సాగును నిరుత్సాహపరుస్తూ ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది అదనంగా 8 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్, మరో 5 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు కలిసి ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.