Mahaa Daily Exclusive

  జమ్ముకశ్మీర్‌లో కుండపోత బీభత్సం….

Share

జమ్ముకశ్మీర్‌లో కుండపోత బీభత్సం.
* ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి.
* అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలు నిలిపివేత

శ్రీనగర్, మహా.
జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. పూంఛ్ జిల్లాలోని లొరాన్ గ్రామంలో మట్టితో నిర్మించిన ఓ ఇంటిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకోగా, సహాయక బృందాలు శిథిలాల తొలగింపు పనులు చేపట్టి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఆదివారం నుంచి పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు సంభవించి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

భారీ వర్షాలు, ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో జమ్ము నగరంతో పాటు పలు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నదులు, వాగులు, వంతెనలు, కొండ ప్రాంతాల వద్ద సివిల్ డిఫెన్స్ సిబ్బందిని మోహరించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోందని అధికారులు హెచ్చరించారు. అమర్‌నాథ్ యాత్రికులు, స్థానికులు, పర్యాటకులు నదులు, వాగుల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. పిక్నిక్‌లు, స్నానాల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లే వారిని వెనక్కి పంపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జూలై 24 వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.

వరద ప్రభావిత పూంఛ్, రాజౌరీ జిల్లాలను జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం సందర్శించింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ మంత్రి షామ్‌లాల్ శర్మ కూడా బృందంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం నష్టంపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని సునీల్ శర్మ తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్‌నాథ్, వైష్ణోదేవి, శివ్‌ఖోరీ యాత్రలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు యాత్రలు పునఃప్రారంభం కాదని స్పష్టం చేశారు. జమ్ము, కథువా, సాంబా, ఉదంపూర్, రాంబన్, బనిహాల్ ప్రాంతాల్లోని బేస్ క్యాంపులు, వసతి కేంద్రాల్లో వందలాది మంది యాత్రికులు నిలిచిపోయారు.

వైష్ణోదేవి యాత్ర నిలిచిపోవడంతో కత్రాలో చిక్కుకున్న భక్తుల కోసం శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్, శ్రైన్ బోర్డు చైర్మన్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు బస్‌స్టాండ్ సమీపంలోని నిహారికా కాంప్లెక్స్‌లో ఉచిత అన్నదాన సేవ (లంగర్) ప్రారంభించారు. భక్తులకు ఉచిత భోజనం, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్ర పునఃప్రారంభంపై అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని శ్రైన్ బోర్డు విజ్ఞప్తి చేసింది.

జమ్ముకశ్మీర్‌లో జూలై 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదలు, కొండచరియలు సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని యంత్రాంగం మరోసారి సూచించింది.