కొత్త విమానాశ్రయాలపై కేంద్రం కీలక ప్రకటన.
* మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు టెండర్లు.
* ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం ప్రాజెక్టులపై తాజా వివరాలు వెల్లడి
ఢిల్లీ, మహా.
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రతిపాదిత విమానాశ్రయాల పురోగతిపై కూడా తాజా సమాచారం ఇచ్చింది.
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ప్రాంతీయ అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 58 విమాన మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయాన్ని రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో (జీఎస్టీతో కలిపి) అభివృద్ధి చేయడానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో రన్‌వే, అప్రాన్, టాక్సీవే నిర్మాణ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఇప్పటికే ఏఏఐ ఆహ్వానించినట్లు పేర్కొంది.
అయితే మామునూరు విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది భూసేకరణ పూర్తి కావడం, అవసరమైన కేంద్ర అనుమతులు లభించడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి నిర్మాణ పనులు, విమానాల రాకపోకల షెడ్యూల్ ఖరారవుతుందని పేర్కొంది.
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై కూడా పురోగతి సాధించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనాన్ని పూర్తి చేసి, విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూవిస్తీర్ణ వివరాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపింది.
పెద్దపల్లి జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయన నివేదికను 2026 ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు కేంద్రం పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుందని వివరించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుపై నిర్వహించిన సర్వేలో ప్రతిపాదిత స్థలం అనుకూలంగా లేదని కేంద్రం వెల్లడించింది. 2025 జనవరిలో రామావరం, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో కొండలు, రైల్వే మార్గం ప్రధాన అడ్డంకులుగా ఉన్నట్లు గుర్తించారని, అందువల్ల ఆ ప్రాంతం విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని తేలినట్లు పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన అవసరమవుతుందని కేంద్రం సూచించింది.
మొత్తంగా తెలంగాణలో ప్రాంతీయ విమానయాన సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని, మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న ప్రాజెక్టుగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.







