Mahaa Daily Exclusive

  తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.

Share

హైదరాబాద్, మహా
తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూనే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అందించిన తరహాలోనే తెలంగాణకు కూడా కేంద్రం న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఆయన, రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని బకాయిల సాధన వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ బకాయిలన్నింటినీ సాధించేందుకు పార్లమెంట్‌లోనూ, ప్రజా వేదికలపైనా నిరంతరం పోరాడతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, కేంద్రం తెలంగాణకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో రిజర్వాయర్లలో కనీస నీటి నిల్వలు కూడా ప్రభుత్వం నిర్వహించలేకపోయిందని ఆయన ఆరోపించారు. రిజర్వాయర్లలో కనీసం 25 నుంచి 30 శాతం వరకు నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించకుండా సముద్రంలోకి వదిలేయడం వల్ల హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించి నీటిని నిల్వ చేయాలని రైతులు, పదవీ విరమణ పొందిన ఇంజినీర్లు కూడా కోరుతున్నారని గుర్తు చేశారు.

ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌.డి. కుమారస్వామిని కలిసి ఈ అంశంపై వినతి పత్రం అందజేశారని తెలిపారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. సున్నపురాయి గనుల లీజుల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అవసరమైన లేఖ పంపితే ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిందని వద్దిరాజు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ఒకప్పుడు 35 లక్షల టన్నులుగా ఉన్న ధాన్య ఉత్పత్తిని మూడు కోట్ల టన్నులకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు దళారులను ఆశ్రయించి కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పంటను విక్రయించాల్సి వస్తోందని ఆరోపించారు. రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే కారణమని అన్నారు.

సింగరేణి సమస్యల పరిష్కారం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, బొగ్గు ఉత్పత్తి పెంపు, తాడిచర్ల-2 గని పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీసీఐ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమయ్యే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాలనపై దృష్టి సారించాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.