జంతర్‌మంతర్ ఆందోళనల వెనుక రాజకీయ ప్రేరేపణ.
* నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది.
* కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి .
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పరిణామాల వెనుక రాజకీయ ప్రేరేపణ ఉందని ఆరోపించారు. గతంలో షాహిన్‌బాగ్ ఆందోళనల్లో పాల్గొన్న వర్గాలే ఈ నిరసనల వెనుక ఉన్నట్లు తమకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిందని కిషన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి నీట్ పరీక్షను నిర్వహించిందని చెప్పారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు 2024లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టే కఠిన చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
జంతర్‌మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలను కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ప్రధాని నివాసం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారణ జరిపి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్న ఆయన, అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. “చలో రాజ్‌భవన్” వంటి కార్యక్రమాలు నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమంపై కాంగ్రెస్‌కు నిజమైన చిత్తశుద్ధి లేదని, వారి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.








