Mahaa Daily Exclusive

  కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలి…

Share

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలి.
• రూ. లక్ష కోట్ల ప్రజాధనం ఏమైందో చెప్పాలి.
* ఎంపీ ధర్మపురి అరవింద్
ఢిల్లీ, మహా.
తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలతో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా తగినంత నీరు అందని పరిస్థితి నెలకొందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల సొమ్ముతో సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారు ఒకవైపు, వారిని కాపాడుతున్న వారు మరోవైపు బాగానే ఉన్నారని, అయితే ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం రైతులేనని అరవింద్ విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాల కారణంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
2023లో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక సమర్పించిందని ఆయన గుర్తు చేశారు. 2019లో మూడు బ్యారేజీల వద్ద పనులు ప్రారంభమైన కొద్ది కాలానికే పగుళ్లు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. అనంతరం 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఇసుక కారణంగా కుంగిపోయిన విషయాన్ని కూడా ఎన్డీఎస్ఏ ప్రస్తావించిందన్నారు. డీపీఆర్‌కు అవసరమైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ముందుగా నిర్ణయించిన ప్రదేశాలకు బదులుగా ఇతర ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కమిషన్లు చెల్లించాలనే ఉద్దేశంతోనే నిర్మాణ పనులను తొందరపాటుగా పూర్తి చేశారని విమర్శించారు.
ప్రాజెక్టు డిజైన్లను ఎందుకు మార్చారనే అంశంపై సంబంధిత ఫైళ్లను కోరినా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అరవింద్ మండిపడ్డారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఉందని పేర్కొన్నారు. మూడు బ్యారేజీలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చోట పునర్నిర్మాణం లేదా మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవినీతిపై గత 30 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. సుమారు రూ.30 వేల కోట్ల విలువైన పనులు పూర్తయిన తర్వాతే ఎన్డీఎస్ఏను ఆశ్రయించారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లపాలైందని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు రాజకీయ ఆరోపణలు చేస్తూ, ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.