సీజేపీ హింసాత్మక నిరసనలపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు.
* హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌ల రద్దుపై పరిశీలన.
* డిజిటల్ ఆధారాల సేకరణ ముమ్మరం.
ఢిల్లీ, మహా.
సీజేపీ నిర్వహించిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హింసలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయగా, కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు (ఏసీపీలు)తో పాటు ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు వెల్లడించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు హింసకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు. డిజిటల్ ఆధారాల పరిశీలన అనంతరం బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని, అందులో భాగంగా పాస్‌పోర్ట్‌ల రద్దు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.








