ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు.
* సీఎం చంద్రబాబు.
* ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.
* ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
అమరావతి, మహా.
ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలను సాకారం చేయడమే కాకుండా, ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం అమరావతిలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని నిర్మించినట్లు తెలిపారు. 3,800 మీటర్ల పొడవైన రన్‌వేతో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ ఎయిర్‌పోర్టు తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. విమానయాన రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, మరో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు కీలక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అతిథుల స్వాగతం, వేదిక ఏర్పాట్లు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొని ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎంకు వివరాలు అందజేశారు.








