Mahaa Daily Exclusive

  హైడ్రాను రద్దు చేయాలి…పేదల ఇళ్లే లక్ష్యంగా చర్యలు: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు.

Share

 

హైదరాబాద్, మహా .
రాష్ట్రంలో హైడ్రాను వెంటనే రద్దు చేస్తేనే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన సోమవారం స్పందిస్తూ, ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు రంగనాథ్‌ను బలిపశువును చేశారని ఆరోపించారు.

హైడ్రా చర్యలు చట్టబద్ధత పేరుతో సాగినా, ఆచరణలో మాత్రం పేదల ఇళ్లపైనే ఎక్కువగా దృష్టి సారించాయని రాంచందర్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంఐఎం కనుసన్నల్లోనే హైడ్రా పనిచేసిందని ఆరోపిస్తూ, ప్రభావశీల వ్యక్తులు, పెద్ద సంస్థల జోలికి వెళ్లకుండా సాధారణ ప్రజలనే లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఫాతిమా కాలేజీ వంటి వివాదాస్పద నిర్మాణాలు, బడా భూకబ్జాదారుల విషయంలో హైడ్రా చర్యలు కనిపించలేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైడ్రాను రద్దు చేసి, పేదల ఆస్తులను రక్షించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయని, వాటిపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, లోతుకుంట ప్రభుత్వ భూముల కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సెక్రటరీ హోదాలో ఉన్న అధికారికి తగదని వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అర్హత కలిగిన అధికారిని ఆ స్థానంలో నియమించాలని సూచించిన న్యాయస్థానం, రంగనాథ్ కొనసాగితే ‘రూల్ ఆఫ్ లా’ దెబ్బతింటుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను అదే పదవిలో కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంది.

హైకోర్టు ఆదేశాలను ప్రతిపక్షాలు స్వాగతించాయి. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, హైడ్రా వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.