హైదరాబాద్, మహా.
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి సారించింది. రంగనాథ్‌కు మద్దతుగా నిలుస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వ్యవహారంపై సమగ్ర న్యాయ సలహా కోసం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్‌ను న్యూఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. గతంలో నమోదైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు, వాటిపై వెలువడిన తీర్పులు, చట్టపరమైన అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు పూర్తి ప్రతిని అందుకున్న తర్వాత డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రదర్శించారని వ్యాఖ్యానించిన ధర్మాసనం, సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి నుంచి ఇటువంటి వ్యవహారం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది.
రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి, అర్హత కలిగిన మరో అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు సంబంధించిన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదుకావడం ఆందోళనకరమని పేర్కొన్న ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో అదే అధికారిని కొనసాగించడం చట్టపాలన స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది.
రూల్ ఆఫ్ లా పరిరక్షణ కోసం బాధ్యతాయుతమైన పరిపాలన అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. వరుసగా కోర్టు ఆదేశాల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని అదే పదవిలో కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది.
అయితే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. లీగల్ ఒపీనియన్, తీర్పు పూర్తి పాఠ్యం, గత కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.








