వాషింగ్టన్, మహా.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశాలపై ఆశలు పెరుగుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కీలక ఒప్పందం ఈరోజు లేదా రేపటిలోగా కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, హోర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం ఈ చర్చల ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఈ సముద్ర మార్గం మళ్లీ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు సరఫరా వ్యవస్థకు భారీ ఊరట లభిస్తుందని చెప్పారు.
బెసెంట్ వ్యాఖ్యల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై వెంటనే కనిపించింది. హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంటుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ జలమార్గంలో సాధారణ రాకపోకలు పునరుద్ధరించబడితే సరఫరా అంతరాయాలు తగ్గడంతో పాటు ధరలపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరుపుతున్నామన్న వార్తల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒమాన్‌తో సముద్ర మార్గాలకు సంబంధించిన అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతుండగా, హోర్ముజ్ జలసంధి భవిష్యత్ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.








