మోదీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణ.
• పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం తర్వాత దిగొచ్చిన సంస్థ.
ఢిల్లీ, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపు వ్యవహారంలో మెటా వెనక్కి తగ్గింది. ఈ ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపినట్లు వెల్లడైంది. ప్రధాని మోదీ వీడియో తొలగింపుతో పాటు సీఎస్ఏఎమ్ , డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై కూడా సంస్థ విచారం వ్యక్తం చేసింది. తమ ప్లాట్‌ఫామ్ నిర్వహణలో కొన్ని లోపాలు జరిగినట్లు అంగీకరించిన మెటా, కొన్ని రకాల కంటెంట్‌కు ప్రాధాన్యం కల్పించేందుకు భారీ మొత్తంలో డబ్బులు స్వీకరించిన విషయాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం.
జులై 23న ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పార్లమెంటరీ కమిటీ, ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెటాకు మూడు రోజుల గడువు విధించింది. నిర్ణీత సమయంలో స్పందించకపోతే సంస్థపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మెటా స్పందిస్తూ జరిగిన పొరపాట్లపై విచారం వ్యక్తం చేసింది. కంటెంట్ నిర్వహణలో లోపాలు తలెత్తిన విషయాన్ని అంగీకరించిన సంస్థ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ అంతర్గత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొంది. ఈ పరిణామంతో సోషల్ మీడియా వేదికల బాధ్యత, కంటెంట్ నియంత్రణ, పారదర్శకతపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.







