చేనేత మన సంస్కృతికి చిరస్మరణీయ వారసత్వం.
* నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
*’చేనేత వస్త్రాలను ఆదరించాలని పవన్ పిలుపు.
అమరావతి, మహా.
చేనేత ఒక వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, ప్రతి నూలుపోగులో నేతన్న శ్రమ, చెమట, కుటుంబ జీవనం అల్లుకుని ఉంటాయని పేర్కొన్నారు. చేనేతను పరిరక్షించడం అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్, దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత రంగం ఒకటని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 1.27 లక్షల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి నేతన్నల సంక్షేమం, ఆర్థిక భద్రత కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి “నేతన్న సేవలో” పథకం ద్వారా ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. అలాగే పింఛన్లు, తక్కువ వడ్డీ రుణాలు, సామాజిక భద్రతా పథకాల ద్వారా చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
ఉప్పాడ జాందానీ వంటి ప్రత్యేక చేనేత ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించడం రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను 2018 నుంచి చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నానని గుర్తు చేస్తూ, రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “వోకల్ ఫర్ లోకల్” పిలుపు స్ఫూర్తితో ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను ఆదరించాలని పవన్ కల్యాణ్ కోరారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత దుస్తులు ధరించడం ద్వారా నేతన్నలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వెచ్చిస్తోందని వెల్లడించారు.
అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన సుమారు 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తూ ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో రూ.79 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.
ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు, అమరావతి సమీపంలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మాణం వంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుండటం రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.








