Mahaa Daily Exclusive

  రష్యాకు పెట్రోల్‌ పంపుతున్న భారత్‌..! డ్రోన్‌ దాడులతో రిఫైనరీలు దెబ్బతినడంతో మాస్కోకు ఇంధన కష్టాలు…

Share

• డ్రోన్‌ దాడులతో రిఫైనరీలు దెబ్బతినడంతో మాస్కోకు ఇంధన కష్టాలు.
• రెండు నెలల్లో 10 లక్షల బ్యారెళ్ల సరఫరా.

ఢిల్లీ, మహా.
ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్‌ కోసం భారత్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌ వరుసగా నిర్వహిస్తున్న డ్రోన్‌ దాడులతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశీయ పెట్రోల్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ముడి చమురు కొరత లేకపోయినా, దాన్ని పెట్రోల్‌గా మార్చే రిఫైనింగ్‌ సామర్థ్యం తగ్గిపోవడంతో మాస్కో విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ఇంధన రంగ విశ్లేషణ సంస్థ వొర్టెక్సా ప్రకారం జూన్‌, జులై నెలల్లో భారత్‌ నుంచి రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ సరఫరా అయింది. ఆగస్టులోనూ ఈ సరఫరా కొనసాగింది. ఈ నెలలో రష్యా సముద్ర మార్గం ద్వారా రోజుకు సగటున 1.25 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను దిగుమతి చేసుకున్నట్లు అంచనా. భారత్‌తో పాటు టర్కీ, మొరాకో కూడా రష్యాకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నప్పటికీ భారత సరఫరా భారీగా ఉన్నట్లు సమాచారం.

ముడి చమురు రష్యాదే.. పెట్రోల్‌ భారత్‌ నుంచి

ఈ పరిణామంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్‌ భారీగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అదే ముడి చమురును దేశంలోని రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఉత్పత్తులుగా మార్చుతున్నారు. ఇప్పుడు రష్యాలో రిఫైనరీలు దెబ్బతినడంతో అదే శుద్ధి చేసిన పెట్రోల్‌లో కొంత భాగాన్ని తిరిగి రష్యాకే ఎగుమతి చేస్తున్నారు.

గుజరాత్‌లోని వడినార్‌ రిఫైనరీ ఈ సరఫరాలో కీలకంగా ఉంది. దీన్ని నయారా ఎనర్జీ నిర్వహిస్తోంది. ఇందులో రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌కు సుమారు 49 శాతం వాటా ఉంది. రాయిటర్స్‌ ప్రకారం ఆగస్టు ప్రారంభంలో వడినార్‌ నుంచి పెట్రోల్‌ను తీసుకెళ్లిన ట్యాంకర్‌ రష్యాలోని విటినో పోర్టుకు చేరింది. అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా దేశీయ వినియోగానికి ఇంధనాన్ని తరలించినట్లు సమాచారం.

డ్రోన్‌ దాడులతో పడిపోయిన ఉత్పత్తి

రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు తీవ్రం కావడంతో ఇంధన ఉత్పత్తి భారీగా దెబ్బతింది. తాజా అంచనాల ప్రకారం ఆగస్టు చివరి నాటికి రష్యా పెట్రోల్‌ ఉత్పత్తి దేశీయ డిమాండ్‌లో సుమారు 70 శాతానికే పరిమితమైంది. రోజుకు దాదాపు 80 వేల టన్నుల ఉత్పత్తి ఉండగా, వేసవిలో డిమాండ్‌ సుమారు 1.15 లక్షల టన్నులుగా ఉన్నట్లు సమాచారం.

పెర్మ్‌, నిజ్నీ నొవ్‌గొరోడ్‌, యారోస్లావ్‌ ప్రాంతాల్లోని రిఫైనరీలు దాడులు, సాంకేతిక సమస్యలతో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. ఫలితంగా రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ విక్రయాలపై పరిమితులు విధించాల్సి వచ్చింది. దేశీయ సరఫరాను పెంచేందుకు రష్యా ప్రభుత్వం పెట్రోల్‌ ఎగుమతులపై నిషేధాన్ని 2027 జనవరి 31 వరకు పొడిగించింది.

భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

రష్యా ఇంధన సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రిఫైనింగ్‌ సామర్థ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్లకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు రష్యాలో రిఫైనరీలు దెబ్బతినడంతో భారతదేశంలో తయారైన పెట్రోల్‌ రష్యా అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది.

అందుకే ప్రస్తుత పరిస్థితిని ‘రష్యా వద్ద చమురు ఉంది.. కానీ దాన్ని శుద్ధి చేసే సామర్థ్యం దెబ్బతింది’ అనే విధంగా చూడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌ దాడులు కొనసాగితే రష్యా మరింతకాలం విదేశీ శుద్ధి ఇంధనంపై ఆధారపడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో భారత్‌–రష్యా మధ్య ఇంధన వాణిజ్యంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది.