- రహదారుల పరిశుభ్రత పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న
- పారిశుద్ధ్య నిర్వహణ పై అసహనం వ్యక్తం చేసిన కమిషనర్
వరంగల్, కార్పొరేషన్ మహా;
గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు, డివైడర్లు , ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రధాన రహదారులు, డివైడర్లు, కూడళ్ల ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నగరంలోని ప్రధాన రహదారులు, డివైడర్లు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కమిషనర్ టి. వెంకన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రహదారుల డివైడర్ల పై చెత్త, మట్టి, ఎండిన ఆకులు, చెట్ల కొమ్మలు పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివైడర్లు, ప్రధాన రహదారులు నిత్యం పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కనిపించేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సంబంధిత సిబ్బంది పై బాధ్యత నిర్ధారించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ల ను హెచ్చరించారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.
అనంతరం లక్ష్మీపురం మార్కెట్‌లో మంజూరైన 5 టీపిడి సామర్థ్యం గల కంప్రెస్డ్ బయో మిథనైజేషన్ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్లాంట్ కు సంబంధించిన వర్క్ టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు, నగర పారిశుద్ధ్య నిర్వహణకు ఎంతో ఉపయోగకరమైన ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు.
కమిషనర్ వెంట సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, ఎం హెచ్ ఓ రాజేష్, డీఈలు, ఏఈలు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.








