- వరంగల్ తూర్పు ఎమ్మెల్యే గానే కొనసాగుతారా?
- రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ
వరంగల్, బ్యూరో మహా;
గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో దుమారం రేపింది. కొన్ని నెలలుగా కొండా సురేఖ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని ఊహాగానాలకు చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం గురువారం మంత్రి పదవి నుండి కొండా సురేఖ ను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా కుటుంబం దారి ఎటువైపు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కొండా సుస్మిత వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన దగ్గర్నుంచీ కొండా సురేఖ, మురళీ లు మొదట ఏ విధంగా అయితే ఉన్నారో.. చివరి వరకూ అదే విధానం కొనసాగించారు. పైగా ప్లాన్ బీ పైన కొండా మురళీ చమత్కార వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి వివాదం మొదలైనప్పుడే వారు ప్లాన్ బీ సిద్దం చేసుకుని ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే ఆ ప్లాన్ బీ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరడమే ప్లాన్ “బీ” నా? అన్న చర్చ నడుస్తోంది. కొండా సురేఖ ఉప ఎన్నికల్లో గెలవాలన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం రాజకీయంగా మనుగడ కొనసాగించాలన్నా ఏదో ఒక ప్రధాన పార్టీ అండ అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కొండా సురేఖ ను కాంగ్రెస్ ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఆ పార్టీలో గతంలో ఉన్న గౌరవం ఇక ముందు ఉండే అవకాశం లేదు. అలాగే, రాష్ట్ర విభజన నేపథ్యంలో వైసీపీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కొండా సురేఖ, మురళి లు 2018 ఎన్నికల ముందు ఆ పార్టీని వీడారు. ఆ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నాయకత్వం పై తీవ్ర విమర్శలు చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో కొండా కుటుంబం బీఆర్‌ఎస్ పార్టీలో చేరే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొండా సురేఖ, మురళి లను పార్టీలో చేర్చుకునే విషయంలో బీజేపీ సానుకూలంగా ఉందన్న ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు పలువురు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు ఒక వైఖరిని తీసుకోవడానికి కొంత సమయం పట్ట వచ్చునని చెబుతున్నారు. నియోజకవర్గంలోని తమ అనుచరులతో సమాలోచనలు, ఇతర పార్టీల నుంచి ప్రతిపాదనలను బట్టి ఒక వైఖరి తీసుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పడం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశంగా మారింది.







