- మల్లికార్జున ఖర్గే ధ్వజం.
- కేంద్ర ప్రభుత్వం, సీఈసీ తీరుపై ఆగ్రహం.
- రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన ఇండియా కూటమి నేతలు.
న్యూఢిల్లీ, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ ఏకపక్ష వైఖరి వల్ల దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నట్లు వెల్లడించారు.
ఓటు చోరీ, ఈవీఎంలపై తీవ్ర విమర్శలు..
సీఈసీకి వ్యతిరేకంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఖర్గే ప్రస్తావించారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని, ఈవీఎంల ద్వారా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమస్యలపై గత అనేక సంవత్సరాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కేవలం ఒక ముఖం మాత్రమేనని, ఆయన వెనుక అసలు సూత్రధారి బీజేపీ సర్కారేనని ఖర్గే తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
నియంతృత్వ పోకడలకే బిజెపి యత్నం..
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, నియంతృత్వ ధోరణులతో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఖర్గే విమర్శించారు. దేశంలో నాయకులను ఎన్నుకునేదే ఓటు హక్కు అని, ఆ హక్కును కనుక తొలగిస్తే దేశంలో నియంతృత్వ పాలన వచ్చినట్లేనని హెచ్చరించారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని స్వయంగా సంఘం అధికారులే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.







