రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది.
* బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, మహా .
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. స్వయంగా న్యాయవాది అయిన రాంచందర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడేందుకు న్యాయవాద లోకమంతా ఏకతాటిపైకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవం ఉండాలని రాంచందర్‌రావు హితవు పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అపాయింట్మెంట్ అడిగి రాజకీయ మెమోరాండాలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో పేరుమోసిన సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికీ, న్యాయస్థానాల్లో పిటిషన్లు ఎలా దాఖలు చేయాలో రాహుల్‌కు కనీస సలహా కూడా ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయస్థానాల వద్ద ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ వ్యవస్థలను అప్రతిష్టపాలు చేసే సంస్కృతిని సమాజం ఎన్నటికీ హర్షించబోదని తేల్చిచెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని కేరళ కాంగ్రెస్ విభాగం అధికారికంగా పోస్టులు పెడుతూ, సీజేఐ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం న్యాయవ్యవస్థపై సాగిస్తున్న ప్రత్యక్ష దాడి అని ఆయన మండిపడ్డారు. దేశంలో అశాంతిని ప్రేరేపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతోనే కాంగ్రెస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో పలుమార్లు న్యాయస్థానాల్లో క్షమాపణలు చెప్పిన చరిత్ర కలిగిన రాహుల్ గాంధీకి రాజ్యాంగ విలువలపై గౌరవం లేదన్నారు. ఎస్ఐఆర్ ద్వారా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరిన ఆయన, చట్టవిరుద్ధంగా ఎక్కడా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు.







