Mahaa Daily Exclusive

  పట్టభద్రుల ఎమ్మెల్సీ కి కాంగ్రెస్ నజరు….

Share

పట్టభద్రుల ఎమ్మెల్సీ కి కాంగ్రెస్ నజరు.
• ఓటర్ల నమోదుపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం.
• ఢిల్లీ వేదికగా గ్రాడ్యుయేట్ ఎన్నికల వ్యూహరచన.
• ఫారం-18తో ప్రతీ పట్టభద్రుడికి ఓటు హక్కు: కాంగ్రెస్ లక్ష్యం.
• వరంగల్, హైదరాబాద్ స్థానాలపై హస్తం పార్టీ గురి.

హైదరాబాద్, మహా.

తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులు వ్యూహరచన చేశాయి.

ఢిల్లీ వేదికగా ఎన్నికల శంఖారావం.

తెలంగాణలో రానున్న శాసనమండలి ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించి, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణను ఖరారు చేశారు.

లక్ష్యంగా రెండు కీలక స్థానాలు.

ప్రధానంగా మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌, వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రెండు స్థానాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కావడంతో, ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన నిలబడుతూ ఓటర్ల నమోదును ముమ్మరం చేసేలా కార్యాచరణను రూపొందించారు.

ఓటర్ల నమోదుపై అప్రమత్తత.

ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల నమోదు అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ పట్టభద్రుడిని గుర్తించి, వారిని ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు సమన్వయంతో చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఫారం-18పై విస్తృత అవగాహన.

గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం పట్టభద్రులు మళ్లీ ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. విద్యావంతుల్లో ఈ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా, నమోదు శాతాన్ని పెంచవచ్చని పార్టీ భావిస్తోంది. నవంబరు 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండటంతో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం.

జిల్లాలవారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర పట్టభద్రుల సంఘాలను కలుపుకుపోతూ ముందుకు సాగాలని జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి సీఎం మార్గనిర్దేశం చేశారు. ఆయా వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారిని ఓటర్లుగా నమోదు చేయించడంలో అండగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకోవడం ద్వారా ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని ఉద్ఘాటించారు.
.