- ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్
- ప్రత్యేక పూజలు.. అభిమానుల కోలాహలం
- సందడిగా మారిన విజయవాడ
విజయవాడ, మహా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, ఆలయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఏపీకి రావడం ఇదే తొలిసారి కావడంతో విజయవాడ నగరంతో పాటు గన్నవరం విమానాశ్రయ ప్రాంగణం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. సీఎం విజయ్ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయం వెలుపలకు వచ్చిన విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెంట అభిమానులు ఉత్సాహంతో పరుగులు తీశారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం విజయ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ.. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ అన్నపూర్ణా దేవి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ మంటపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం దుర్గగుడి అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, కనకదుర్గమ్మ చిత్రపటాన్ని సీఎం విజయ్‌కి అందజేశారు. దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం సీఎం విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి బయలుదేరి వెళ్లారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయం, ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించేందుకు వేదిక కానుంది. మంగళవారం రాత్రి విజయవాడ నగరంలో వైభవంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం విజయ్ పాల్గొన్నారు. తమిళనాడు సీఎం తొలిసారిగా ఏపీకి వచ్చి ఇటు దైవదర్శనం, అటు రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా దర్శనం పూర్తయ్యేలా, అభిమానుల రద్దీని నియంత్రించేలా విజయవాడ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.







