- రాజకీయ నాయకులు కాదు
- ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, మహా : రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో కింది స్థాయి నుండి అవినీతి వేరూనుకుపోయిందని, తాను ఎంత నిజాయితీగా పనిచేయాలని భావించినా కింది స్థాయిలో అక్రమాల వల్ల ప్రజలకు సేవలు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు కరెప్ట్ కాదని, క్షేత్రస్థాయిలో వ్యవస్థ బాగాలేదని ప్రభుత్వ ఉద్యోగులే అవినీతిపరులని పేర్కొన్నారు. ఉదాహరణకు ఒక పని చేయమని అధికారులకు తాను స్వయంగా చెప్పినా జరగలేదని, అదే ఆఫీసులో రూ. 15,000 లంచం ఇస్తే పని పూర్తయిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. అలాగే, రూ. 5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లుకు సంబంధించి మెజర్మెంట్ బుక్ చేయడానికి 10 నుంచి 20 శాతం లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను వెలుగులోకి తేవలసిన బాధ్యత జర్నలిస్టులదేనని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులు పత్రికల్లో హెడ్లైన్స్గా ఈ నిజాలను రాస్తే, ఆ అక్రమాలకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు ఎందుకు పారిపోతున్నారో, పనులు ఎందుకు నిలిచిపోతున్నాయో మీడియా బయటపెట్టాలని, అందుకు తాను పూర్తి మద్దతుగా ఉంటానని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు వసూలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ, రోడ్డు, డ్రైనేజీ పనుల కాంట్రాక్టర్ల వద్దకు వెళ్లి తమ కమిషన్ ఎంత అని బెదిరింపులకు దిగుతున్నారని, ఈ ప్రభావమంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇద్దరు ముగ్గురు రైటర్లు కూర్చుని రోజుకు లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.







