Mahaa Daily Exclusive

  మహాలక్ష్మి గ్యాస్‌ పథకంపై కొత్త మార్గదర్శకాలు..! ఆధార్‌ అనుసంధానానికి ప్రభుత్వం ఆదేశాలు..

Share

  • మహాలక్ష్మి గ్యాస్‌ పథకంపై కొత్త మార్గదర్శకాలు.
  • ఆధార్‌ అనుసంధానానికి ప్రభుత్వం ఆదేశాలు.
  • వేలిముద్రలు పడకపోయినా సబ్సిడీకి ఇబ్బంది లేదు.
  • ఐరిస్‌, ఫేస్‌ అథెంటికేషన్‌తో పాటు ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలకు అవకాశం.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించే కార్యక్రమంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ అందించడంతో పాటు నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు రేషన్‌ కార్డు, ఆధార్‌, ఎల్పీజీ కనెక్షన్‌ వివరాలను అనుసంధానం చేయాలని ఆదేశించింది. లబ్ధిదారుల గుర్తింపు, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఆధార్‌ లేకున్నా ప్రత్యామ్నాయ అవకాశం
పథకానికి అర్హులైన వారు ఆధార్‌ వివరాలతో గుర్తింపు ధ్రువీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్‌ అందుబాటులో లేని వారికి వెసులుబాటు కల్పించింది. పాన్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు వంటి ప్రత్యామ్నాయ పత్రాల ద్వారా గుర్తింపును ధ్రువీకరించుకునే అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు సరిగా పడని వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఐరిస్‌, ముఖ గుర్తింపు విధానాల ద్వారా అథెంటికేషన్‌ చేసుకునేందుకు అనుమతించింది. ఓటీపీ, క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ధ్రువీకరణ పద్ధతులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
బయోమెట్రిక్ సమస్యలతో పథకం నిలిచిపోకుండా..
వేలిముద్రలు సరిపోకపోవడం, ఆధార్‌ అథెంటికేషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో అర్హులైన కుటుంబాలకు సబ్సిడీ నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుర్తింపు ధ్రువీకరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కొత్త విధానాన్ని రూపొందించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
నకిలీ లబ్ధిదారుల ఏరివేతకు ప్రత్యేక విధానం
పథకం ప్రయోజనాలు నిజమైన అర్హులకే అందేలా నకిలీ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేషన్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌, ఆధార్‌ వివరాలను పరిశీలించడం ద్వారా అర్హతను నిర్ధారించనున్నారు. మరోవైపు ఆయిల్‌ కంపెనీలకు ప్రతి నెలా సబ్సిడీ నిధులను ముందస్తుగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో జమ చేయనున్నారు.
మహాలక్ష్మి పథకం కింద తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలకు రూ.500 సబ్సిడీ ధరతో వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నారు. ఈ పథకం అమలులో లబ్ధిదారుల గుర్తింపు, సబ్సిడీ చెల్లింపుల్లో పారదర్శకత పెంచడంతో పాటు అర్హులకు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే తాజా మార్గదర్శకాల ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

Latest