తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. 24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్‌లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే…దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది, వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనం అన్నారు. మీ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు…ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గం అని దుయ్యబట్టారు.







