బీసీల సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ ను నెరవేర్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. బహుజనుల బాంధవుడిగా ముఖ్యమంత్రిని కీర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీసీసంఘాలు, కాంగ్రెస్ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. అసెంబ్లీకి బీసీసంఘాల నేతలు క్యూకట్టి అభినందనలు తెలిపారు. దశాబ్దాల ఉద్యమ డిమాండ్ ను నెరవేర్చి.. మా కల సాకారం చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీల దేవుడిగా కీర్తించారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు మాత్రమే వేయించుకున్న నేతలున్న కాలంలో.. రాహుల్ గాంధీ మాట.. రేవంత్ బాట లాగా రాజకీయ ప్రయోజనాలు లేకుండా బీసీ బిల్లును పెట్టి ఆమోదించడం చారిత్రాత్మకమంటూ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కారును ప్రశంసిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల బీసీసంఘాల నేతలు కూడా సీఎం రేవంత్ ను అభినందిస్తూ ఫోన్ లు చేశారు. సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను అభినందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు.
ఇదీ ఘనత
బీసీ రిజర్వేషన్ బిల్లు శాసన సభలోను, శాసన మండలిలో ఆమోదం పొందడంతో ఇక బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయి. ఇప్పటి దాకా విద్య ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించింది. ఈ గణనలో 56.36 శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్ల పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధింత బిల్లులకు చట్ట సభలు ఆమోద ముద్ర వేశాయి. అంటే ఇక నుంచి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ నియామకాల్లో, అదే రీతిలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు దక్కనున్నాయి. ఇది చారిత్రాత్మకమని.. బీసీసంఘాలు అభినందిస్తున్నాయి. రాష్ట్ర పరిధిలో ఉన్నదంతా చేశారని, మీ నిబద్దతకు హ్యాట్సాఫ్ అంటూ బీసీ సంఘాలు, నేతలు చెప్పారు.
నేనే నాయకత్వం వహిస్తా- సీఎం రేవంత్ రెడ్డి
బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2026 లో జరిపే జన గణనలో కులగణన చేర్చాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. మనం అందరం కలిసి కొట్లాడితే కుల గణనను ఎందుకు చేర్చరు. కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా? కొట్లాడితే జన గణనలో కుల గణన ఎందుకు చేర్చరు. జన గణనలో ఒకసారి కులగణన చేర్చితే ఆ తర్వాత ప్రతి పదేళ్లకోసారి మరింత స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగస్వాములం కావడం మాకు గర్వకారణంగా ఉంది. దీన్ని తప్పుబడితే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బలహీన వర్గాలు తమ హక్కుల సాధన కోసం చేసే పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడుతా. ఈ సర్వే పునాది లాంటిది. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చు. ఈ కుల గణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని భావించే వారి ఉచ్చులో పడొద్దు” అని హితవు చెప్పారు.







