ఆదిలాబాద్, మహా: కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తల తిక్క పనులతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, అందుకే కుప్పకూలిపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ ప్రజాసేవాభవన్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ఆదర్శ పాలన ఎట్లా అవుతుందనీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాల్లో కూడా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందనే పూర్తి విశ్వాసం ఉందనీ మంత్రి జూపల్లి అన్నారు. పరిపాలన ద్వారా ఉమ్మడి జిల్లాలో కచ్చితంగా మార్పులు తెస్తామన్నారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే.. వాటిని తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.
ఆ హక్కు బీజేపీకి లేదు..
తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆనాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఇచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, ఈనాడు కూడా నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ.. తెలంగాణకు మొండి చేయి చూపుతున్నారని, తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలను చూసి మానవీయ కోణంలో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కొట్లాడి సాధించుకున్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. అవినీతి, నిర్బంధ, కుటుంబ, అప్రజాస్వామిక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాం నాయక్, భోజారెడ్డి, గణేష్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.







