హైడ్రా
ఈగల్
రేవంత్ తగ్గేదెలే
పేర్లతోనే హడల్.. ఆచరణలోనూ మోడల్
ఆక్రమణదారుల వెన్నులో వణుకుపుట్టించిన హైడ్రా
హైడ్రాకు మద్దతుగా.. వ్యతిరేకంగా ఆందోళనలు
మరో సంచలనానికి సిద్దమవుతున్న ఈగల్
డ్రగ్స్ విక్రయ రాకెట్ పై నిఘా.. కాలేజీలపై ఫోకస్
హైదరాబాద్, మహా
తెలంగాణ సర్కార్ అక్రమాలు.. ఆక్రమణలు.. అనర్ధాలపై తగ్గేదెలే అంటూ యుద్దం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా అక్రమార్కుల్లో.. ఆక్రమణదారుల్లో ఎంత హడల్ పుట్టించిందో రాష్ట్రమే కాదు దేశమంతా తెలుసు. ఇపుడు ఈగల్ కూడా అదే పద్దతిలో గద్దలా వాలేందుకు సిద్దమైంది. ఎంతటివారున్నా.. ఎలాంటి వారున్నా.. తప్పుచేస్తే దండించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీపడరని హైడ్రా, పుష్ప సంఘటనలు నిరూపించాయి. ఇపుడు ఈగల్ తో డ్రగ్స్ గంజాయి వ్యాపారులకు వ్యసనపరులకు దబిడిదిబిడే అని పోలీసువర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈగల్ వ్యవస్థ
తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటికి వ్యూహాత్మకంగా పేర్లు పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే వందల నిర్మాణాలు నేలమట్టం చేశారు. హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇపుడు హైడ్రా లాంటి మరో కొత్త వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన ‘ఈగల్ వ్యవస్థ’ను ఏర్పాటు చేసింది. ఈగల్ వ్యవస్థ బలంగా వెళ్ళేందుకు సినీ స్టార్లు రామ్ చరణ్, విజయ్ దేవరకొండలను కూడా ప్రారంభానికి ఆహ్వానించారు. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ‘ఈగల్’గా పిలుస్తామని.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక టీంలో శిక్షణ పొందిన గద్దలు ఉంటాయని.. తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడతాయన్నారు. రేవంత్ ఒకసారి హెచ్చరిస్తే దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ప్రధానంగా కాలేజీలపై ఫోకస్ పెట్టారు. యువత చెడు అలవాట్లకు గురవుతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్న కాలేజీలపై, స్కూల్ యాజమాన్యాలపై కూడా కఠిన శిక్షలకు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ విక్రేతలకు ఏడేళ్ళ జైలుశిక్ష పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గుబులు పుట్టించిన హైడ్రా
హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాల పై హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుట్టింది. మొదట్లో ఉన్నంత దూకుడు లేకున్నా.. ఇపుడు హైడ్రా భయానికి కొనుగోలు దారులు కూడా చూసి కొంటున్న పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు క్రమంగా మద్దతు పెరిగింది. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా లేఖలు, ర్యాలీలు నిర్వహించడంతో ప్రభుత్వం దీనిని కొనసాగిస్తోంది. ప్రధానంగా చెరువుల పరిరక్షణ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.







