Mahaa Daily Exclusive

  బెంగాల్ లో గెలిచాం….

Share

  • బెంగాల్ లో గెలిచాం
  • తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం
  • కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవినీతి ఉంటుంది
  • తెలంగాణలో మావోయిస్టులను కాంగ్రెస్ కాపాడుతోంది
  • బీజేపీని గెలిపిస్తే పూర్తిగా తుడిచేస్తాం
  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంది
  • విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి
  • భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ

హైదరాబాద్, మహా : బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ గెలిచిందని, తెలంగాణలోనూ అదికారంలోకి వస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాన మంత్రి మాట్లాడారు. దేశ మంతా బీజేపీ పాలన కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కూడా అందుకు సిద్దమయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలన్నప్పుడు రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు సహజమని, అయితే బెంగాల్ లో బీజేపీ గెలుపుపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయింది రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో అవినీతి, కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అస్సోంలోనూ విజయం సాధించామని, పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ పార్టీలను పక్కనపెట్టారని, మమతా బెనర్జీ నియంతృత్వానికి చరమగీతం పాడారన్నారు.

“తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్‌ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు… అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశంలో 14 ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు జరుగుతున్నాయని, అందులో ఒకటి జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, కాంగ్రెస్‌ ఎక్కడున్నా ఒకటే మోడల్‌ అదే అవినీతి మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారని, ఆఖాశంలోని కచుక్కలను తీసుకు వస్తామని చెబుతారంటూ ఎన్నికలైన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేస్తారన్నారు. హామీల గురించి అడిగితే సాకులు వెతుకుతారని చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని విమర్శనాస్త్రాలను సంధించారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కాంగ్రస్ ను గెలిపించినందుకు బాధ పడుతున్నారని, తెలంగాణలోనూ మీరంతా కాంగ్రెస్ పాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారన్న విషయం తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ విధానం మొదట ఓట్లు దండుకో ఆ తర్వాత మరిచిపో అన్నట్లు ఉంటుందన్నారు.

కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంఎంసీగా మారిందని అంటూ ఎంఎంసీ అంటే అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు.
“కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి. మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారింది. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. అప్పుడు తెలంగాణ మావోయిస్టు రహితంగా మారుతోంది” అంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం వల్లే చమురు సంక్షోభం

యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం వచ్చిందిని ప్రధాని మోదీ వివరించారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదన్న ఆయన పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని, ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెట్రో రైళ్ళు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వీలైనంత వరకు మెట్రో రైలును వినియోగించుకోవాలన్నారు. ఒకప్పుడు యుద్ధాలు వస్తే ప్రజలు తమ వద్ద బంగారాన్ని ఇచ్చే వారని ఇప్పుడు ఆ పని చేయవద్దంటూ మీరంతా వంట నూనెల వాడకం తగ్గించండి, విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించండి, ఇంధన పొదుపు కోసం ఉపక్రమించండి, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకండని పిలుపునిచ్చారు.

వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వండి

ఇంధన పొదుపులో భాగంగా కార్యాలయాలు, ఐటీ కంపనీలు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. ప్రజలు వీలైనంత వరకు వ్యక్తి గత వాహనాల వినియగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్లు లాంటి పెద్ద వాహనాలను వాడినపుడు తమతో పాటు మరికొంత మందిని తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నించాలన్నారు. ‘ప్రపంచం ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాతో సప్లయ్ చైన్ దెబ్బతింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయి. రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు నా వినతి. పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించండి. విదేశీ మాదకద్రవ్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలి. ప్రజా రవాణాను వినియోగించాలి. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. మధ్యతరగతి ప్రజలు విదేశీ ప్రయాణాలు మానుకోవాలి’ అని అన్నారు.