Mahaa Daily Exclusive

  తెలంగాణకు 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Share

 

హైదరాబాద్, మహా : తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభిమానం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారం కోసం అబద్దపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పదే పదే కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాత్రను పరేడ్ గ్రౌండ్ సభ ద్వారా వివరించిన కిషన్ రెడ్డి గణాంకాలను వెల్లడించారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏకంగా రూ. 12 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ. 1.85 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా 5 వందేభారత్‌ రైళ్లు, 42 రైల్వేస్టేషన్ల అభివృద్ధి, అలాగే 3 బుల్లెట్‌ ట్రైన్స్‌ కూడా తెలంగాణకు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సన్న బియ్యం పథకానికి కేంద్రమే 80 శాతం నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు. ‘ఇవన్నీ రాహుల్‌ గాంధీ ఇచ్చారా? లేక కేసీఆర్‌ తెచ్చారా? ఇది మోదీ ప్రభుత్వ నిబద్ధత కాదా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ ఆయన కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నారన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలకు తెరలేపిందని, ‘ఎస్ఐఆర్’ పేరుతో ప్రభుత్వం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

కుటుంబాల చేతిలో తెలంగాణ బందీ

పదేళ్లు ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ, ఇప్పుడు గాంధీ కుటుంబం చేతిలో చిక్కుకుపోయిందన్నారు. అబద్ధపు గ్యారంటీలతో ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటు. కానీ మేము మాట తప్పం కాబట్టే కేంద్రంలో 3సార్లు అధికారంలోకి వచ్చామన్నారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటమే మా పనితీరుకు నిదర్శనమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడితే ఎనిమిది సీట్లిచ్చిన బీజేపీ ఎం చేసిందని మాట్లాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మీరేమి చేశారో ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారన్నారు. కుటుంబ పార్టీల చేతుల్లో బందీగా మారిన తెలంగాణ విముక్తి చెందాలంటే అది కేవలం ‘మోదీ గ్యారంటీ’తోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారని, రాబోయే ఎన్నికల్లో రుజువు అవుతుందన్నారు.