వికసిత్ భారత్‌లో తెలంగాణది కీలకపాత్ర.
* పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.
*దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే.
* పీఎంవోలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయండి. *మా ప్రాజెక్టులకు రెండు గంటలు కేటాయించండి.
* మీ పెద్ద మనసు చాటుకోండి.
* ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి.
* మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.
హైదరాబాద్, మహా.
వికసిత్ భారత్ – 2047 లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు సత్వర అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు వేగంగా ఆమోదం తెలిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంవో) ప్రత్యేకంగా ‘సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో, తెలంగాణ నుంచి 10 శాతం వాటా అందించేలా ‘తెలంగాణ రైజింగ్ – 2047’ ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేసేందుకు తెలంగాణ ఆకాంక్షిస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రగతి కోసం రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, హైదరాబాద్ – మచిలీపట్నం 12 వరుసల రహదారితో పాటు పలు రేడియల్ రోడ్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల కోసం తాను, మంత్రులు పలుమార్లు ఢిల్లీ చుట్టూ తిరిగామని, ఈ ప్రతిపాదనల అత్యవసర అనుమతుల కోసం ప్రధాని కేవలం రెండు గంటల సమయం కేటాయించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వృద్ధి అంతా మహానగరాల చుట్టే తిరుగుతోందని, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలను అభివృద్ధి చేసినప్పుడే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని విశ్లేషించారు. ప్రధాని మోదీకి పెద్ద మనసు ఉందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తరచూ చెబుతుంటారని, అదే నమ్మకంతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనసుతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్)ను సీఎం రేవంత్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలతో కలిసి ప్రధాని ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి – జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, మహబూబ్‌నగర్ – గూడబెల్లూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-167), కాజీపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ మహోత్సవంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







