Mahaa Daily Exclusive

  ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తెలంగాణ భూములను దోచుకునే కుట్ర: కాంగ్రెస్ ప్రభుత్వంపై మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) తీవ్ర విమర్శలు

Share

ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను దోచుకునే కుట్ర చేస్తోందని ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు తీవ్రంగా విమర్శించారు.

అమెరికాలో మాజీ మంత్రి హరీశ్ రావు గారు “అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం” అని ప్రకటించగానే కాంగ్రెస్ నేతలలో భయం మొదలైందన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో తమ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు గారి ప్రకటన గట్టి దెబ్బ తగిలిందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ కోసం సమీకరించిన భూములను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే భూములను “ఫ్యూచర్ సిటీ” పేరుతో కబ్జా చేసి దోచుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇదే విషయాన్ని హరీశ్ రావు గారు స్పష్టం చేశారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదన్న భయంతో కాంగ్రెస్ నేతలు తెలంగాణను కేకు ముక్కల్లా పంచుకుని అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీతులు చెప్పే అర్హత లేదని MGR గారు అన్నారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేయడం, అసైన్డ్ భూములను కబ్జా చేయడం, అక్రమ వ్యాపారాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఆయన కుటుంబంపై ఉన్నాయని పేర్కొన్నారు.

2023లో ఐటీ శాఖ, 2024లో ఈడీ చేసిన దాడులను ప్రస్తావిస్తూ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్, అక్రమ మైనింగ్, భూకబ్జాలు, కోట్ల రూపాయల లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కొత్వాల్ గూడ, మానస హిల్స్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్లు నడపడం, గచ్చిబౌలి ప్రాంతంలో భూమి కబ్జా యత్నాలు, రూ.1400 కోట్ల విలువైన భూములపై వివాదాలు అన్నీ ప్రజలకు తెలిసిందేనన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఎప్పటికైనా బయటపడతాయని హెచ్చరించారు.

హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని, మెట్రోను నిర్మించి నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం అప్పుల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపిందన్నారు.

“ఫ్యూచర్ లేని సిటీకి మెట్రో” అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశం అన్న భావనతో భారీ స్థాయిలో అవినీతి, దోపిడీకి పాల్పడుతోందన్నారు.

రేపు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు చేసిన అక్రమాలన్నింటికీ చట్టపరమైన పరిణామాలు తప్పవని, ప్రజాగ్రహంతో కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయమని MGR గారు స్పష్టం చేశారు.

– మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)
ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జ్