Mahaa Daily Exclusive

  యాదగీశుని సన్నిధిలో ప్రగతి ప్రస్థానం….

Share

యాదగీశుని సన్నిధిలో ప్రగతి ప్రస్థానం.
* రూ.100 కోట్లతో వేద పాఠశాల.
* భక్త వసతుల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ.
* కంచి పీఠాధిపతి సమక్షంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
యాదాద్రి, మహా.

తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య సన్నిధి శనివారం నాడు సరికొత్త ఆధ్యాత్మిక, ప్రగతి శోభను సంతరించుకుంది. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలనే దృఢ సంకల్పంతో, ఆలయ పరిసరాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు వంద కోట్ల రూపాయల (రూ.99.55 కోట్లు) భారీ వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక వేద పాఠశాల భవన నిర్మాణంతో పాటు భక్తుల వసతులకై ఉద్దేశించిన ఐదు ప్రధాన అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపనలు చేశారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, శనివారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో హెలికాప్టర్ నేరుగా యాదగిరిగుట్ట పరిధిలోని పెద్ద గుట్టపై ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంది. ఇక్కడే సుమారు 43 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నూతన వేద పాఠశాల ప్రాంగణంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్యమంత్రితో పాటు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర विजयేంద్ర సరస్వతి స్వామిగారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి, కంచి స్వామివార్ల హస్తాల మీదుగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
అయితే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలో జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ , మధ్య ఘోరమైన సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన హెలికాప్టర్ పెద్ద గుట్టపై ల్యాండ్ అయినప్పటికీ, అక్కడ వారికి స్వాగతం పలికేందుకు కానీ, కనీస ప్రోటోకాల్‌ను పర్యవేక్షించేందుకు కానీ జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ సమయానికి అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. అధికారుల ఈ అంతులేని నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వాగతం పలికే నాథుడే కరువవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు దాదాపు 15 నిమిషాల పాటు హెలికాప్టర్‌లోనే ఉండిపోవాల్సి రావడం ప్రభుత్వ వర్గాలలో సంచలనంగా మారింది.
ఈ అవాంతరాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండపైకి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి జరిగిన అష్టోత్తర శత ఘటాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పేరిట అర్చకులు ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ముఖమండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపికతో రేవంత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఐదు కీలక ప్రగతి పనులకు శంకుస్థాపన రాళ్లు వేశారు. పెద్ద గుట్టపై నిర్మించనున్న అత్యాధునిక ఆధ్యాత్మిక విద్యా కేంద్రమైన వేద పాఠశాల భవన నిర్మాణంతో పాటు, కొండపైన భక్తుల సౌకర్యార్థం 9 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నిత్య కల్యాణ మండపానికి శ్రీకారం చుట్టారు. వీటితో పాటు స్వామివారి మాలధారణ చేసే భక్తుల నివాసం కోసం, సాధారణ భక్తుల విశ్రాంతి కొరకు 43 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించే దీక్షాపరుల సదన్ మరియు డార్మిటరీల సముదాయానికి భూమిపూజ చేశారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వార రాజగోపురం నుండి కొండపైకి వెళ్లే కాలినడక మార్గానికి కోటి 41 లక్షల రూపాయలతో నిర్మించనున్న పైకప్పు పనులకు, ప్రధాన ఆలయం వాయువ్య దిశలో ఉన్న మాడ వీధుల నుండి రథశాలకు నేరుగా చేరుకునేందుకు కోటి 35 లక్షల రూపాయలతో నిర్మించే మెట్ల మార్గ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ ఉన్నత స్థాయి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో మరియు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని భక్తులను, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి యాదగిరిగుట్ట గుండెకాయ వంటిదని ఆయన కొనియాడారు. గత పాలనలో జరిగిన పనులను కొనసాగిస్తూనే, భక్తులకు కనీస వసతులలో ఎక్కడా లోటు రాకుండా మరిన్ని హంగులు అద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం కాంక్రీట్ కట్టడాలే కాకుండా, కంచి మహాస్వామి అనుగ్రహంతో నిర్మిస్తున్న ఈ వేద పాఠశాల ద్వారా భావితరాలకు సనాతన ధర్మాన్ని, వేద విద్యను అందించబోతున్నామని, యాదద్రిని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
మరోవైపు, ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా యాదగిరిగుట్ట పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండపైకి వెళ్లే ఉచిత బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం దర్శనం ముగిసే వరకు సామాన్య భక్తులను క్యూలైన్లలోనే నిలిపివేయడంతో అధికారుల తీరుపై భక్తులు కొంత అసహనం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 11:30 గంటల ప్రాంతంలో తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.