Mahaa Daily Exclusive

  సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.:ఉత్తమ్ కుమార్ రెడ్డి

Share

  • సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.:ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని వెల్లడి.

భద్రాద్రి కొత్తగూడెం, మహా.
తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త దిశను నిర్దేశించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల సాగునీటి అవసరాలను తీర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యావరణ, న్యాయ, సాంకేతిక పరమైన అన్ని అడ్డంకులను అధిగమించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.

సీతమ్మసాగర్ ప్రాజెక్టు విషయంలో గతంలో అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదనలు వినిపిస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులను చట్టబద్ధంగా పొందిన అనంతరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. చట్టపరమైన ఇబ్బందులు తొలగిన తర్వాత పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన 67 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి కేంద్ర జల సంఘం తుది అనుమతి ఇవ్వడం కీలక మైలురాయిగా మంత్రి అభివర్ణించారు. ఈ అనుమతితో ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగుభూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు భూసేకరణ, సాంకేతిక అనుమతులు, పర్యావరణ అనుమతుల ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కూడా మంత్రి స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచించిన సాంకేతిక ప్రమాణాల ప్రకారమే కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తై భద్రతా ధ్రువీకరణ లభించిన తర్వాతే బ్యారేజీల్లో నీటి నిల్వలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ భద్రత, నిర్మాణాల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని అన్నారు.

రాష్ట్రంలో సాగునీటి పరిస్థితిపై మాట్లాడిన మంత్రి, కాళేశ్వరం బ్యారేజీల్లో నీటి నిల్వలు లేకపోయినా రైతులు రికార్డు స్థాయిలో పంటలు సాగు చేశారని తెలిపారు. యాసంగి సీజన్‌లో సుమారు 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపు రూ.19 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు మొత్తం రూ.80 వేల కోట్లకు పైగా నేరుగా చెల్లించినట్లు వెల్లడించారు.

నీటిపారుదల శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాఖలో వెయ్యికి పైగా ఇంజినీర్ల నియామకం, సుమారు 1,800 మంది ఫీల్డ్ సిబ్బంది భర్తీ, పెండింగ్ పదోన్నతుల మంజూరు వంటి చర్యలతో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. రైతుల శాశ్వత ప్రయోజనాలు, సాగునీటి భద్రత, శాస్త్రీయ ప్రమాణాల అమలే ప్రభుత్వ ప్రాధాన్యమని, రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టును నాణ్యతతో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.