నిరసనలపై నిషేధం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
జెన్‌కో సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి
: దేవీప్రసాద్,
కుషాయిగూడ, మహా : జెన్‌కో యాజమాన్యం ఉద్యోగులు, ఇంజనీర్లు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, నినాదాలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర ఆందోళన కలిగిస్తోందని టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు గుండవరం దేవీప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యగా భావిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యోగుల గొంతును నొక్కే ప్రయత్నం అత్యంత దురదృష్టకరమన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన యాజమాన్యం బెదిరింపులు, క్రమశిక్షణ చర్యల పేరుతో ఉద్యోగులను భయపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు వెలువడలేదని గుర్తు చేశారు.
ఇటీవల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేటీకరించే టెండర్లపై ఉద్యోగులు, ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిషేధ ఉత్తర్వులు రావడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను దశలవారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకించే స్వరాలను అణచివేయడానికే ఈ చర్యలు చేపట్టారా అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టింది ఉద్యోగులు, ఇంజనీర్లేనని, అలాంటి వారిని నేరస్థుల్లా చూస్తూ నిరసన తెలిపితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అన్యాయమన్నారు. విద్యుత్ సంస్థల్లో కొనసాగుతున్న ఆంధ్రా అధికారుల పెత్తనం కారణంగానే తెలంగాణ ఉద్యోగులపై వివక్షపూరిత ధోరణి కొనసాగుతోందన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే జూలై 16న జారీ చేసిన నిరసనల నిషేధ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను గౌరవించాలని, ఉద్యోగులపై బెదిరింపులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలను వెంటనే నిలిపివేయాలని కోరారు. విద్యుత్ సంస్థలు తెలంగాణ ప్రజల ఆస్తి అని, వాటిని కాపాడాలని కోరుతున్న ఉద్యోగుల గొంతును అణచివేయడం కాకుండా వారి ఆందోళనలను ఆలకించి పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యుత్ ఉద్యోగులు ప్రజారంగ పరిరక్షణ కోసం ఐక్యంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.








