అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా స్థానికులు కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి.
గతంలో బల్లగరువు పర్యటన సందర్భంగా గిరిజనులతో మమేకమైన పవన్ కల్యాణ్ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని తాగునీరు, అంగన్వాడీ భవనాలు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలను నిర్దేశిత గడువులోనే అమలు చేయడంతో స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో రూ.55 లక్షల వ్యయంతో మూడు అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. బల్లగరువు, వెలగపాడులో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించగా, కొరపర్తిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ నిర్మించారు.
అదనంగా కొరపర్తి గ్రామంలోని ఎంపీపీ పాఠశాల భవనాన్ని పునరుద్ధరించారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు ఏర్పాటు చేసి, పైప్‌లైన్‌ల ద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు.
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన తెలిపారు.








