- మేకలతండా లో ఘనంగా సీత్లా వేడుక
- పాడిపంటల సమృద్దికి దాటోడీ
కారేపల్లి , మహా: కారేపల్లి మండలం మేకలతండా లో సీత్లా(దాటోడీ) పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాడిపంటల సమృద్దికి బంజార గిరిజనులు ఈ దాటోడి వేడుకను నిర్వహించటం ఆనవాయితీ. గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ దేవత కాపాడుతుందని బంజారాల నమ్మకం. ఆషాఢమాసంలో మంగళవారాలలో ఈ పండుగను జరుపుతారు. తండాల సరిహద్దులో (పొలిమేరల) సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా కోళ్లు, మేకలతో డప్పు వాయిద్యాలు వాయిస్తూ, మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పేగుల పైనుంచి పశువులను దాటిస్తారు. అందుకనే దీనిని దాటోడీ అని అంటారు. దీని వలన పశుసంపదకు ఎలాంటి వ్యాధులురాకుండా పాడిపంటలు పండుతాయని గిరిజనుల నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బానోత్ రాంమ్మూర్తి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.








