- 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారుల నియామకం.
హైదరాబాద్, మహా.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వర్షపాతం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ పంటలు, విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం పాత 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ప్రత్యేక అధికారులు జులై 20 నుంచి ఆయా జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా సమీక్షించనున్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి వర్షాభావ పరిస్థితులు, తాగునీటి అందుబాటు, సాగునీటి అవసరాలు, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల మట్టాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందించనున్నారు.
జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టనుంది. ఈ ప్రత్యేక అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, వర్షాభావ నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగానికి అవసరమైన సహాయ చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల్లో హైదరాబాద్ జిల్లాకు జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లాకు వికాస్ రాజ్, కరీంనగర్ జిల్లాకు బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, మెదక్ జిల్లాకు ఎ. వాణి ప్రసాద్, నిజామాబాద్ జిల్లాకు యోగితా రాణా, నల్గొండ జిల్లాకు హరిచందన దాసరి, ఆదిలాబాద్ జిల్లాకు ఇలంబరితి కె, వరంగల్ జిల్లాకు ఎ. శ్రీదేవసేన, మహబూబ్‌నగర్ జిల్లాకు వి.పి. గౌతమ్, ఖమ్మం జిల్లాకు అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, నీటి వనరులను సమర్థంగా వినియోగించడం, వ్యవసాయ రంగానికి అవసరమైన సహకారం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లాల వారీగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.








