హైదరాబాద్, మహా.
ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే రాజకీయ సంస్కృతికి స్వస్తి పలకాలంటూ ముఖ్యమంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇకపై పనితీరు ఆధారంగానే గుర్తింపు, బాధ్యతలు ఉంటాయని, పైరవీలతో పదవులు దక్కే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు. నాయకత్వం అంటే హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లో కూర్చోవడం కాదని, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
పదవుల కోసం పైరవీలు చేసే నాయకులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని పార్టీ నాయకత్వానికి సీఎం కరాఖండిగా సూచించారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయి కార్యక్రమాలపైనే దృష్టి సారించాలని, ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
హైదరాబాద్‌లోనే ఉండి పనిచేయకుండా కాలం గడిపే నాయకులపై కూడా రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఇన్‌ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్ అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎంపీలు కూడా తమకు కేటాయించిన జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఎంపీలు సమర్థంగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 30న మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యతతో ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌ల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రతి నాయకుడు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని పని చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు ప్రత్యేక గుర్తింపుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.








