మోదీ దిగిపో!
* మోదీ ఇంటి ముందు మెరుపు ధర్నా.
*ఢిల్లీలో హైటెన్షన్.
* విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా భగ్గుమన్న కాంగ్రెస్.
* రాహుల్‌ను బలవంతంగా ఎత్తుకెళ్ళిన పోలీసులు.. ముక్కుకు గాయం.
* ప్రియాంక గాంధీని మెడపట్టి లాక్కెళ్లిన పోలీసులు.
* దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు.
ఢిల్లీ, మహా.
జాతీయ రాజధాని ఢిల్లీలో మోదీ సర్కార్ దమనకాండపై కాంగ్రెస్ అగ్రనేతలు భగ్గుమన్నారు. నీట్ పరీక్ష అక్రమాలను ప్రశ్నించిన అమాయక విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీఛార్జికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. మంగళవారం రాహుల్ గాంధీ నేతృత్వంలో అగ్రనేతలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగడంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చేతులకు తాళ్లు కట్టుకుని మరీ నిరసన తెలుపుతూ.. విద్యార్థులపై దౌర్జన్యానికి నైతిక బాధ్యత వహిస్తూ “మోదీ తక్షణమే దిగిపోవాలి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. మోదీ మౌనం వీడే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుకూర్చున్నారు.
**ప్రజాస్వామ్యంపై పోలీసుల ఉక్కుపాదం..**
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలపై మోదీ సర్కార్ పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపింది. ధర్నాను భగ్నం చేసే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా, అమానుషంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ పెనుగులాటలో రాహుల్ ముక్కుకు తీవ్ర గాయమైంది. మరోవైపు, కనీసం మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అత్యంత పాశవికంగా మెడ పట్టి ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ అరాచకానికి, అహంకారానికి అద్దం పడుతోంది. ఖర్గే, వేణుగోపాల్ సహా పలువురు సీనియర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
**మేము పిరికివాళ్ళం కాదు: ప్రియాంక గాంధీ**
పోలీసుల దమనకాండ, మోదీ సర్కార్ తీరుపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేంద్ర ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోంది. వారికి భయం పట్టుకుంది. మమ్మల్ని చూసి వాళ్లు వణికిపోతున్నారు. మేము వాళ్ల లాగా పిరికివాళ్లం కాదు.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు” అని ఆమె గర్జించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని, ఇది ముగింపు కాదని, కేంద్రం పతనానికి ఆరంభమని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా హెచ్చరించారు.
**రగులుకున్న దేశం..**
రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దౌర్జన్యం, అగ్రనేతల అక్రమ అరెస్టుల వార్తలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఢిల్లీ ఘటనకు నిరసనగా దేశ నలుమూలలా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, మోదీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగడుతున్నారు. నీట్ కుంభకోణం, విద్యార్థులపై పోలీసుల దాడులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తోంది.







