ఢిల్లీ, మహా.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలన్న డిమాండ్ విషయంలో ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తన మాట మార్చి కొత్త షరతులు విధిస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం సాయంత్రం ఎక్స్ వేదికగా స్పందించిన జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకరించిందని చెప్పారు. అయితే మొదట చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ, అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. మాట తప్పడం, కొత్త షరతులు విధించడం సరైన రాజకీయ సంస్కృతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రత్యక్షంగా కలిసి మాట్లాడారు. ఆందోళనను విరమించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నేతలు తమ నిరసనను కొనసాగించారు.
సోమవారం విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు నిరసనగా, అలాగే నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది.







