Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం… అధికారులకు కేటీఆర్ హెచ్చరిక

Share

 

మంచిర్యాల, మహా.
బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చట్టపరంగా జవాబుదారులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.
మంగళవారం మంచిర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను క్షోభకు గురిచేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. తాను కేసీఆర్‌లా మౌనంగా ఉండే వ్యక్తిని కాదని, ఇప్పటికైనా కొందరు తమ వైఖరి మార్చుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యేకు సూచించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే గత 31 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరమ్మతులు చేపట్టాల్సిన ఎల్ అండ్ టీ సంస్థను కూడా ప్రభుత్వం బెదిరించిందని విమర్శించారు.
గోదావరి జలాలు వినియోగం లేకుండా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లిపోతుండగా అక్కడ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వాటిని వినియోగించుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది రెండేనని, ఒకటి ఓట్లు.. రెండోది తిట్లేనని ఎద్దేవా చేశారు. తరచూ “ఏం జాతి మీది?” అని ప్రశ్నించే ముఖ్యమంత్రికి తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని పేర్కొన్నారు. తెలంగాణను ప్రేమించే వారు ఒక జాతి అయితే, తెలంగాణను ద్వేషించే వారు మరో జాతి అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరవు, సాగునీటి సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కనబెట్టి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ముందుకు సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపుల రాజకీయాలను విరమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.